Mecca Death Penalty Hoax| మక్కాలో బంగ్లాదేశ్ పౌరులకు మరణశిక్ష.. భారతీయుడిపై పాక్ అసత్య ప్రచారాలు

సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా మసీదు ప్రాంగణంలో అనైతిక చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలతో బంగ్లాదేశ్‌కు చెందిన నజ్రుల్ ఇస్లాం, స్వీటీ అక్తర్ అనే ఇద్దరికి మరణశిక్ష అమలు చేయడం అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Mecca Death Penalty Hoax | సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా మసీదు ప్రాంగణంలో అనైతిక చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలతో బంగ్లాదేశ్‌కు ( Bangladesh )చెందిన నజ్రుల్ ఇస్లాం, స్వీటీ అక్తర్ అనే ఇద్దరికి మరణశిక్ష అమలు చేయడం అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతుండగా, అసలు వివరాలను సౌదీ అరేబియా స్పష్టంగా పంచుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయాన్ని ఆసరాగా చేసుకుని, ఈ దారుణ ఘటనకు ఓ భారతీయుడే కారణమంటూ పాకిస్తాన్, బంగ్లాదేశ్ సోషల్ మీడియా ఖాతాలు దుష్ప్రచారానికి దిగాయి.

Mecca Death Penalty Hoax | దుష్ప్రచారం..

అక్టోబర్ 20 నుంచి ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్‌లలో ఒక ఫేక్ ప్రచారం జోరందుకుంది. మక్కాలోని మస్జిద్ అల్ హరామ్‌లో క్లీనర్లుగా పనిచేస్తున్న నజ్రుల్, స్వీటీలు ఒక ఏకాంత గదిలో ఉన్న సమయంలో ఒక భారతీయ పౌరుడు కాపలాగా ఉంటూ వారి వీడియో తీశాడని, అనంతరం ఆ వీడియోతో మహిళను బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించాడని ఆరోపించారు. ఆ ప్రయత్నం విఫలమవ్వడంతో సదరు భారతీయుడే వీడియోను అధికారులకు అందజేశాడని, దాంతో సౌదీ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి, భారతీయ పౌరుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, ఆ ఇద్దరు బంగ్లా పౌరులకు ఉరిశిక్ష విధించారంటూ కథనాలు అల్లారు. రియాద్‌లోని పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) యూత్ వింగ్ అధ్యక్షుడు ఫర్హాన్ కియానీతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, ఆఫ్‌ఘనిస్తాన్‌లకు చెందిన పలువురు ఈ ఫేక్ వార్తలను వ్యాప్తి చేశారు.

Mecca Death Penalty Hoax | వివరాలు వెల్లడించని సౌదీ..

భారత పౌరుడిపై వస్తున్న ఈ ఆరోపణలకు ఎలాంటి అధికారిక సమాచారం కానీ, ఆధారాలు కానీ లేవని స్పష్టమవుతోంది. సౌదీ అరేబియాలోని బంగ్లాదేశ్ కాన్సులేట్ వివరాల ప్రకారం.. అల్ మజర్ అనే సంస్థలో క్లీనర్లుగా పనిచేస్తున్న నజ్రుల్‌ను 2023 ఆగస్టు 1న సైబర్ నేరాల చట్టం కింద, మరుసటి రోజు స్వీటీని వేరే కేసులో అరెస్ట్ చేశారు. అయితే వీరిద్దరి కుటుంబాలు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. పాకిస్తాన్‌కు చెందిన ఒక సహోద్యోగే కుట్ర పూరితంగా నజ్రుల్‌ను ఈ కేసులో ఇరికించాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు.

Mecca Death Penalty Hoax | అసలు నిజం ఏంటి?

ఈ కేసు పరిణామాల్లో ఎక్కడా కూడా భారతీయ పౌరుడి ప్రమేయం ఉన్నట్లు సౌదీ అధికారిక యంత్రాంగం కానీ, కాన్సులేట్ కానీ ధ్రువీకరించలేదు. కేవలం భారత్‌పై విషం చిమ్మేందుకు, సంఘటనను పక్కదారి పట్టించేందుకు పాకిస్తాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆధారాలు లేని ఫేక్ స్టోరీలను ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: El Nino Preparedness | విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందాం : కలెక్టర్​ ఇలా త్రిపాఠి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *