అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: El Nino Preparedness | ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు వీలుగా రానున్న రోజుల్లో తాగునీరు, విద్యుత్ అవసరాలకు ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. యాసంగి సీజన్లో వరి సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టరేట్లో అధికారులతో మాట్లాడారు.
El Nino Preparedness | ఆరుతడి పంటలు వేయాలి
సంప్రదాయంగా వస్తున్న వరి పంటకు బదులుగా నీటిలభ్యత ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని కలెక్టర్ (Collector Ila Tripathi) అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ రానున్న రోజుల్లో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా అధిగమించాలని సూచించారు. జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యాసంగిలో వరి సాగుకు నీటి సరఫరా అందుబాటులో ఉండే అవకాశం లేనందున వరిసాగు చేయవద్దని అవగాహన కల్పించాలన్నారు.
El Nino Preparedness | ఆయిల్ పామ్, మొక్కజొన్న..
జిల్లాలో ఆయిల్ పామ్, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు వంటి పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించేలా చూడాలని కలెక్టర్ అన్నారు. గ్రామస్థాయిలో రైతులతో సమావేశాలు నిర్వహించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాల పరిస్థితి వివరించాలని తెలిపారు. రానున్న ఎనిమిది నుండి పది నెలలకు సంబంధించి గ్రామాల వారీగా సమగ్ర ప్రణాళికలు రూపొందించి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన మంచినీటి పైప్ లైన్ల మరమ్మతులు, నూతన నిర్మాణాలు, వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకోవడం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, విజయ కుమారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Chalo Tahsildar Protest | మాట నిలబెట్టుకోని సీఎంను నిలదీయడానికే ‘చలో తహశీల్దార్’