అక్షరటుడే, బాల్కొండ: Double Bedroom Lucky Draw | మండల (Balkonda) కేంద్రంలో నిర్వహించిన రెండో విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వివాదాస్పదమైంది. లక్కీడ్రా నిర్వహణలో అక్రమాలు జరిగాయనే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంలో అధికారులు డ్రా కార్యక్రమాన్ని నిలిపివేశారు.
Double Bedroom Lucky Draw | దరఖాస్తుల రిజిస్టర్లు ఏమయ్యాయి..
ప్రజాపాలన, గ్రామసభల్లో సమర్పించిన దరఖాస్తుల రిజిస్టర్లు కనిపించకుండా పోవడంపై బుధవారం నిర్వహించిన సభలో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్కీ డ్రాను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేయడంతో అధికారులు సభను దాదాపు నాలుగు గంటల పాటు నిలిపివేశారు. అనర్హుల జాబితా, ఆన్లైన్ నంబర్ల కేటాయింపులో తీవ్ర వ్యత్యాసాలున్నాయని స్థానికులు నిలదీశారు. ఎలాంటి ఆన్లైన్ నంబర్లు లేకుండానే సీరియల్ నంబర్లు ఇవ్వడం, అర్హులకు ఇంటి నంబర్లు చూపకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. ఆన్లైన్లో పేర్లు చేర్చేందుకు కొందరు బ్రోకర్లు, అధికారులు రూ. 5,000 నుండి రూ. 10,000 వరకు లంచాలు తీసుకున్నారని లబ్ధిదారులు ఆరోపించారు. అర్హులైన పేదలను వదిలేసి, సంపన్న వర్గాలు, భూములు ఉన్నవారికే ప్రాధాన్యమిచ్చారని మండిపడ్డారు. అన్ని రకాల రసీదులు, మెసేజ్‌లు ఉన్నప్పటికీ తమ పేర్లు జాబితాలో లేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
Double Bedroom Lucky Draw | అధికారుల సమన్వయ లోపం..
ఒకేరోజు ఉదయం 10 గంటలకు పంచాయతీ కార్యాలయంలో, 11 గంటలకు రైతు వేదికలో వేర్వేరుగా సభలు ఏర్పాటు చేయడం కలకలం రేపింది. అధికార పార్టీ జాబితాలో అక్రమాలు ఉన్నాయంటూ ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులు అధికారులతో వాగ్వివాదానికి దిగడంతో లక్కీ డ్రా వాయిదా పడింది. ఎంపీడీవో స్థాయి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు జరిగిన ఈ అవినీతిపై సబ్‌కలెక్టర్ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని జిల్లా మానవ హక్కుల కౌన్సిల్ నాయకులు ప్రదీప్ కుమార్, నర్సింగ్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈనెల 25న జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ గందరగోళంపై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల సునీల్ కుమార్‌కు స్థానికులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత జాబితాను రద్దు చేసి, గ్రామ నియోజకవర్గంలోని అన్ని కులాల పెద్దల సమక్షంలో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Minimum Wages GO 6 | కనీస వేతనాల జీవోను వెంటనే అమలు చేయాలి..