అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BC Commission Visit | బీసీ కమిషన్ ఈ నెల 7న బుధవారం నిజామాబాద్‌కు రానుంది. వీడీసీల గ్రామ బహిష్కరణలపై అధికారులతో కమిషన్ సమావేశం నిర్వహించనుంది.
ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్‌లో గౌడ, ఎస్సీ కులాలకు చెందిన పలువురిని ఇటీవల వీడీసీ సామాజిక బహిష్కరించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేగాకుండా బీసీ, గౌడ సంఘాల నాయకులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బీసీ కమిషన్ స్పందించింది. తాళ్లరాంపూర్తో పాటు జిల్లాలోని 23 గ్రామాల్లో బహిష్కరణకు గురైన బాధితులతో మాట్లాడాలని నిర్ణయించింది. ఈ మేరకు బీసీ కమిషన్ ప్రత్యేక కార్యదర్శి బాలమాయాదేవి ఉత్తర్వులు జారీ చేశారు.
BC Commission Visit | అధికారులతో భేటీ
జిల్లాలో గ్రామ అభివృద్ధి అభివృద్ధి కమిటీల (VDC) సామాజిక బహిష్కరణ ఘటనలు, సామాజిక బహిష్కరణ బాధితులు, దాని నివారణ చర్యలపై జిల్లా యంత్రాంగం, పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని బీసీ కమిషన్ తెలిపింది. తాళ్లరాంపూర్‌లో గౌడ కులస్తుల బహిష్కరణపై కమిషన్ ఈ నెల 3న సమావేశంలో చర్చించింది. జిల్లాలో ఇటువంటి సంఘటనలు తరచుగా జరగడాన్ని తీవ్రంగా పరిగణించిందని ఆమె పేర్కొన్నారు.
BC Commission Visit | బాధితులు హాజరు కావాలి
కమిషన్ ఈ నెల 7న నిజామాబాద్ (Nizamabad)ను సందర్శించి, జిల్లాలోని గ్రామ అభివృద్ధి కమిటీలు విధించిన సామాజిక బహిష్కరణల బాధితులతో మాట్లాడాలని నిర్ణయించింది. ఆయా గ్రామాలకు చెందిన గ్రామ అభివృద్ధి కమిటీల బాధితులు తమ సమస్యలను తెలియజేయడానికి కమిషన్ ముందు హాజరయ్యేలా చూడాలని పోలీసులను కమిషన్ ఆదేశించింది. ఆ గ్రామాలు నాగపూర్, వేల్పూర్, మారంపల్లి, నందిపేట్, గుమ్మిర్యాల్, ఏర్గట్ల, పిప్రి, దోమచంద, సావెల్, నాగంపేట, మంథని, తాళ్ల రాంపూర్, జక్రాన్‌పల్లి, చేంగల్, చౌట్‌పల్లి, మోతే, బస్సాపూర్, పచ్చల్ నడ్కుడ, మిర్దాపల్లి, దేగాం (ఆర్మూర్), అమ్దాపూర్, మిట్టపల్లి, దేగం (ఆలూరు), అంకాపూర్. ఈ గ్రామాల్లోని వీడీసీల బాధితులతో పాటు కలెక్టర్, పోలీస్ కమిషనర్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు, ఆయా మండలాల్లోని ఎస్‌హెచ్‌వోలు, బీసీ సంక్షేమ అధికారితో బీసీ కమిషన్ సమావేశం నిర్వహించనుంది.
కమిషన్ ఛైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి రంగూ జిల్లాలో పర్యటిస్తారు. బుధవారం ఉదయం 11 గంటలకు కమిషన్ నగరానికి చేరుకుంటుంది. మధ్యాహ్నం 1:30 గంటల వరకు కలెక్టరేట్లో సామాజిక బహిష్కరణకు గురైన బాధితులతో మాట్లాడుతుంది. అనంతరం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై మధ్యాహ్నం 02:30 నుండి సాయంత్రం 04:30 వరకు అధికారులతో సమావేశం నిర్వహిస్తుంది.
దీనిని కూడా చదవండి : Tallarampur VDC Action | తాళ్లరాంపూర్ వీడీసీపై చర్యలు తీసుకోవాలి