VOAs Loan Irregularities | సమాఖ్య రుణాల్లో చేతివాటం.. వెలుగుచూస్తున్న వీవోఏ అక్రమాలు

స్వయం సహాయక సంఘాల సభ్యులకు అండగా ఉంటూ, వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చూడాల్సిన గ్రామ సహాయకుడు(వీవోఏ) అవినీతికి బ్రాండ్​ అంబాసిడర్​గా మారాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్‌పల్లి: VOAs Loan Irregularities | స్వయం సహాయక సంఘాల సభ్యులకు అండగా ఉంటూ, వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చూడాల్సిన గ్రామ సహాయకుడు(వీవోఏ) అవినీతికి బ్రాండ్​ అంబాసిడర్​గా మారాడు. కంచె చేను మేసిన చందంగా బ్యాంకులకు చెల్లించాల్సిన నెలవారీ వాయిదాల డబ్బులను నొక్కేస్తూ, రూ.లక్షల్లో సొంతానికి వాడుకుంటున్నట్లు సభ్యులు ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

డిచ్​పల్లి మండలం (Dichpalli Mandal)లో జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఓ గ్రామంలో సుమారు 25 మహిళా సంఘాలు ఉన్నాయి. బ్యాంకు లింకేజీ రుణాల చెల్లింపులు, సభ్యుల పేర్లపై రుణాల వ్యవహారం, రుణాల మంజూరుకు కమీషన్ల వసూళ్లపై ఆరోపణలు తీవ్రమాయ్యాయి. గ్రామ సమాఖ్యకు సంబంధించిన వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వీవోఏ బ్యాంకుకు చెల్లించాల్సిన వాయిదాల సొమ్మును సకాలంలో జమ చేయలేదని, సభ్యుల పేర్లతో తీసుకున్న రుణాల వినియోగంపై అనుమానాలున్నాయని, రుణాలు ఇప్పించినందుకు డబ్బులు వసూలు చేశారని బాధిత మహిళలు వాపోతున్నారు.

VOAs Loan Irregularities | కరోనా సమయం నుంచి..

కరోనా సమయంలో నిరక్షరాస్యులైన 8 సంఘాల మహిళలు బ్యాంకులకు వెళ్లలేక ఇబ్బంది పడగా, దాన్నే తానొక ‘అవకాశం’గా మార్చుకున్నాడు సదరు వీవోఏ. వాయిదాలు తానే బ్యాంకులో కడతానని నమ్మించి, కొన్ని నెలల పాటు సేకరించిన మొత్తాన్ని బ్యాంకులో వేయకుండా సొంతానికి వాడేసుకోవడం కొందరు సభ్యులు నిలదీసిన విషయం బయట పడకుండా జాగ్రత్త పడ్డాడు. వరుసగా మూడు నెలలు వాయిదా పడకపోతే బ్యాంకు అధికారులకు అనుమానం వస్తుందని గ్రహించి, వ్యూహాత్మకంగా మూడో నెలకు సంబంధించిన కిస్తు మాత్రమే చెల్లిస్తూ అధికారుల కంటికి కనపడకుండా దాటవేస్తు వచ్చినట్లు మహిళలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కరోనా కాలంలో సంబంధించిన ఖచ్చితమైన మొత్తం ఎంత? ఎంత సొమ్ము వసూలైంది? ఎంత బ్యాంకులో జమైంది? ఎంత బకాయి ఉంది? అనే వివరాలు అధికారులు వివరాలు సేకరించి పరిశీలించి నిర్ధారణ చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

VOAs Loan Irregularities | సభ్యుల పేర్లపై బినామీ రుణాలు

​ఈ వీవోఏ అక్రమాలు వాయిదాల కాజేతకే పరిమితం కాలేదు. రుణాలు తీసుకునేందుకు ముందుకు రాని పేద మహిళలను బురిడీ కొట్టించి, వీవోఏ తన బైక్‌పై బ్యాంకులకు తీసుకెళ్లి వారి పేర్లతో రుణాలు మంజూరు చేయిస్తూ.. ఆ డబ్బును లబ్ధిదారులకు మహిళలకు ఇవ్వకుండా తనవద్దే ఉంచుకుని బినామీ రుణాల డబ్బుతో గ్రామంలో ఇతరులకు అధిక వడ్డీలకు తిప్పుతూ వ్యాపారం చేస్తున్నట్లు ఆ గ్రామంలో అందరూ కోడై కూస్తున్నారు. మహిళా సభ్యుల పేర్లపై రుణాలు మంజూరైనట్లయితే, ఆ డబ్బు ఎవరికి అందింది? ఖాతా నుంచి ఎవరు విత్ డ్రా చేశారు? రుణం తీసుకున్న సభ్యురాలు ఆ సొమ్మును స్వయంగా వినియోగించుకున్నారా? లేక మరొకరి చేతికి వెళ్లిందా? అనే అంశాలను పరిశీలించాలని సభ్యులు కోరుతున్నారు.

VOAs Loan Irregularities | రుణాలు ఇప్పించినందుకు అడ్డగోలుగా కమీషన్లు..

బ్యాంకు నుంచి రుణాలు మంజూరు చేసినందుకు ఆ వీవోఏ కమీషన్ వసూలు దందా చాలా ఏళ్లుగా సాగుతోంది. రూ. 50 వేల రుణం ఇప్పిస్తే రూ.500, రూ. లక్ష రుణం ఇప్పిస్తే రూ.వెయ్యి, రూ.2 లక్షలకు రూ.2వేలు, రూ. 3 లక్షలకు రూ.3 వేలు.. ఇలా రుణం స్థాయినిబట్టి మహిళా సభ్యుల నుంచి ఆ వీవోఏ ముక్కుపిండి వసూళ్లకు పాల్పడుతున్నట్లు వినికిడి. గ్రామంలోని అన్ని సంఘాల యూనిట్ ప్రాతిపదికన తీసుకోవాల్సిన డబ్బుల కంటే రెట్టింపు మొత్తంలో సంఘాల నుంచి గుంజుతున్నట్లు సమాచారం. అలాగే ప్రతీ నెల గ్రామంలో నిర్వహించే పొదుపు సమావేశానికి ఆలస్యం అయినా సభ్యుల నుంచి రూ. 100 అపరాధ రుసుమును వీవోఏ నిర్ణయించి వసూలు చేసి తన జేబులో వేసుకుంటున్నాడని పలువురు సభ్యలు ఆరోపిస్తున్నారు.

VOAs Loan Irregularities | అధికారులకు విందులు, వినోదాలతో మచ్చిక

వీవోఏ ​తన అక్రమ వ్యాపారానికి అడ్డంకులు రాకుండా ఉండేందుకు ప్రత్యేక వ్యూహం అమలు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. లావాదేవీలు చెల్లించే బ్యాంకుకు కొత్త అధికారులు వచ్చిన ప్రతిసారీ వారికి విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తూ మచ్చిక చేస్తున్నట్లు మహిళలు వాపోతున్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా బ్యాంకుకు వెళ్లిన వారిపై వీవోఏ చిర్రుబుర్రులాడి, మీకు లోన్లు రావని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు మహిళలు వాపోతున్నారు.

VOAs Loan Irregularities | అక్రమ బాగోతం బట్టబయలు

​కొద్ది నెలల క్రితం ఓ సంఘం సభ్యురాలు తన భర్తతో కలిసి కొత్త రుణం కోసం బ్యాంకుకు వెళ్లడంతో వీవోఏ ‘చేతివాటం’ గుట్టు రట్టయింది. పాత బకాయిలు ఇంకా తీరలేదని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆ దంపతులు ఖంగుతిన్నారు. తానులోన్ తీయనుకోలేదని చెప్పగా… ఆమె పేరున వీవోఏ ముందే రుణం తీసుకుని సొంతానికి వాడుకున్నాడని తేలింది. విషయం బయటకు పొక్కితే తన ఉద్యోగం ఊడటంతో పాటు ఊళ్లో చెడ్డపేరు వస్తుందని భయపడిన వీవోఏ…సదరు మహిళ భర్త కాళ్లావేళ్లా ప్రాధేయపడి అప్పట్లో వ్యవహారాన్ని సర్దుబాటు చేసుకున్నట్లు కొందరు మహిళలు చెప్తుండటం గమనార్హం. సదరు వీవోఏపై తక్షణమే విచారణ కమిటీ వేసి, అతని అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని బాధిత మహిళా సభ్యులు వేడుకుంటున్నారు.

ఇది కూడా చదవండి..: Double Bedroom Lucky Draw | గందరగోళంగా డబుల్ బెడ్‌రూమ్ లక్కీ డ్రా.. కలెక్టర్‌కు ఫిర్యాదు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *