అక్షరటుడే, డిచ్పల్లి: School Inspection | సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను, వంట గది, స్టోర్ రూమ్, తరగతి గదులను పరిశీలించారు.
School Inspection | నిర్వాహకులపై ఆగ్రహం..
కస్తూర్బా పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండి అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి నిర్వాహకులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులు విష కీటకాల బారినపడితే ఎవరు బాధ్యులని నిలదీశారు. వెంటనే పరిసరాలను శుభ్రం చేయించాలని, దోమలు వృద్ధి చెందకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది, విద్యార్థినుల హాజరును ఎఫ్ఆర్ఎస్ విధానంలో అమలు చేస్తున్నారా లేదా అన్నది పరిశీలించారు. పలువురు సిబ్బంది అటెండెన్స్ నమోదు వివరాలలో తేడాలు ఉన్నట్లు గమనించిన కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. హాజరులో లోపాలు ఉంటే జీతాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. టాయిలెట్లు, ఫ్లోరింగ్ తదితర నిర్మాణాల పనులు ఎందుకు ప్రారంభం కావడం లేదని సంబంధిత ఇంజినీరింగ్ విభాగం అధికారులను ప్రశ్నించారు. కస్తూర్బా విద్యాలయాలలో మౌలిక సదుపాయాల కల్పన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, తక్షణమే పనులు చేపట్టి నాణ్యతతో జరిగేలా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు.
School Inspection | ఆహారపదార్థాల నాణ్యతపై ఆరా..
ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేసి, మధ్యాహ్న భోజనం మెనూ వివరాలు పాలనాధికారిణి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. నాసిరకం బియ్యం, సరుకులు కేటాయిస్తే వెంటనే మండల అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. ఆర్వో ప్లాంట్ నిరుపయోగంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్, మరమ్మతులు చేయించాలని, వీలుపడని పక్షంలో కొత్త ప్లాంట్ కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. పాఠశాల ఆవరణ, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, తాను వారం పది రోజుల తర్వాత మళ్లీ పాఠశాలను సందర్శిస్తానని, ఆలోగా అన్ని లోటుపాట్లను చక్కదిద్దుకోవాలని సూచించారు. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లను క్రమం తప్పకుండా సందర్శిస్తూ నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించాలని మండల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ రవీందర్, ఎంపీడీవో ఆరీఫ్ అహ్మద్, ఎంఈవో రమేష్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ షేక్ పర్వీన్ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Jukkal Congress Protest | జుక్కల్‌లో కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీ అరెస్ట్‌పై ఆగ్రహం