అక్షరటుడే, వెబ్‌డెస్క్: Venkatradri App | తిరుమల Tirumala శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు సాంకేతికతను మరింత చేరువ చేసే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో అడుగు ముందుకేసింది.
భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ‘వేంకటాద్రి’ మొబైల్ యాప్‌ను సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. తిరుమలలోని ఆలయాలు, దర్శన ద్వారాలు, వైద్య సదుపాయాలు, అన్నప్రసాద కేంద్రాలు సహా వివిధ ప్రదేశాలను సులభంగా గుర్తించేందుకు ఈ యాప్ ఉపయోగపడనుంది.
Venkatradri App | ఏఐ వాయిస్ అసిస్టెంట్..
ఈ యాప్‌లో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా పనిచేసే వాయిస్ అసిస్టెంట్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. దీని ద్వారా భక్తులు తమకు కావాల్సిన సమాచారం కోసం టైప్ చేయాల్సిన అవసరం లేకుండా, వాయిస్ కమాండ్లతోనే సమీపంలోని సదుపాయాలను గుర్తించవచ్చు. తాగునీటి కేంద్రాలు, దర్శన ప్రవేశ ద్వారాలు, ఆసుపత్రులు, మరుగుదొడ్లు వంటి ప్రాంతాలకు చేరుకునేందుకు ఈ సదుపాయం తోడ్పడుతుంది.
మరో ముఖ్యమైన అంశం ఆఫ్‌లైన్ నావిగేషన్. ఇంటర్నెట్ కనెక్టివిటీ బలహీనంగా ఉన్నా, అందుబాటులో లేకపోయినా మార్గసూచనలను ఉపయోగించుకునేలా ఈ సదుపాయాన్ని కల్పించారు. దీంతో రద్దీ సమయాల్లోనూ భక్తులు తమకు అవసరమైన ప్రాంతాలను గుర్తించేందుకు వీలవుతుంది.
Venkatradri App | 25 విభాగాలు.. 350కు పైగా ప్రదేశాలు
‘వేంకటాద్రి’ యాప్‌లో మొత్తం 25 విభాగాలకు చెందిన 350కు పైగా ప్రదేశాల వివరాలను పొందుపరిచారు. భక్తులకు నిత్యం అవసరమయ్యే సదుపాయాలతో పాటు పరిపాలనా, భద్రతా సేవలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందుబాటులో ఉంచారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
Venkatradri App | యాప్‌లోని వివరాలు ఇవే..
- దర్శనం, మార్గదర్శనం: దర్శన ప్రవేశ ద్వారాలు, ఆలయ పరిసరాలు, బస్ స్టాప్‌లు, బస్సు మార్గాలు, సమయాలు.
- ప్రాథమిక సదుపాయాలు: తాగునీటి కేంద్రాలు, మరుగుదొడ్లు, ఉచిత పాదరక్షల డిపాజిట్ కేంద్రాలు, లగేజీ కేంద్రాలు.
- ఆరోగ్యం, అత్యవసర సేవలు: ఆసుపత్రులు, వైద్య కేంద్రాలు, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాలు, హెల్ప్‌లైన్ నంబర్లు.
- భోజనం, వసతి: అన్నప్రసాద కేంద్రాలు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయం, క్యాంటీన్లు, ఆహార విక్రయ కేంద్రాలు, గది కేటాయింపు కౌంటర్లు.
- ఇతర సేవలు: భక్తుల సహాయ కేంద్రాలు, టీటీడీ కార్యాలయాలు, ఉప విచారణ కార్యాలయాలు, కల్యాణకట్టలు, పార్కింగ్ ప్రదేశాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు.
పార్కింగ్ చేసిన ప్రాంతాన్ని మర్చిపోయినా ఇబ్బంది లేదు!
తిరుమలలో రద్దీ కారణంగా వాహనాన్ని ఎక్కడ పార్కింగ్ చేశామో గుర్తుపట్టలేకపోవడం కొందరు భక్తులకు ఎదురయ్యే సమస్య. దీన్ని దృష్టిలో ఉంచుకుని యాప్‌లో ‘మార్క్ మై స్పాట్’ అనే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
దీని ద్వారా పార్కింగ్ చేసిన ప్రదేశాన్ని లేదా ఇతర ముఖ్యమైన ప్రాంతాన్ని గుర్తుగా సేవ్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు తిరిగి ఆ ప్రాంతానికి చేరుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, పోలీస్ సేవలు, టీటీడీ హెల్ప్‌లైన్ వివరాలు కూడా యాప్‌లో ఉంటాయి.
Venkatradri App | కియోస్క్‌ల ద్వారా సేవలు
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని యాప్‌ను తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందించారు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో ఇది అందుబాటులో ఉన్నట్లు టీటీడీ వెల్లడించింది.
స్మార్ట్‌ఫోన్ లేని భక్తులు కూడా ఈ సాంకేతిక సేవలను వినియోగించుకునేలా కియోస్క్‌ల ద్వారా సదుపాయాలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా డిజిటల్ సేవలను మరింత ఎక్కువ మంది భక్తులకు చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Venkatradri App | భక్తుల సౌకర్యమే లక్ష్యం
యాప్ ప్రారంభోత్సవం సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, అమెరికాకు చెందిన ఎన్నారై దాత జేపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు యాప్ పనితీరును వివరించారు. భక్తులకు ఆధునిక సాంకేతికతతో మెరుగైన సేవలు అందించేలా యాప్‌ను రూపొందించిన టీటీడీ బృందాన్ని ముఖ్యమంత్రి అభినందించారు.
సమాచారాన్ని వెతుక్కోవడానికి, అవసరమైన ప్రాంతాలకు చేరుకోవడానికి భక్తులు పడే ఇబ్బందులను తగ్గించడం ఈ యాప్ ప్రధాన ఉద్దేశం. ఏఐ వాయిస్ అసిస్టెంట్, ఆఫ్‌లైన్ నావిగేషన్, బహుభాషా సదుపాయాలతో తిరుమల యాత్రను మరింత సులభతరం చేయడమే కాకుండా, భక్తులు ప్రశాంతంగా శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు ‘వేంకటాద్రి’ యాప్ ఉపయోగపడుతుందని టీటీడీ ఆశాభావం వ్యక్తం చేసింది.