అక్షరటుడే వెబ్డెస్క్: Aligina Bathukamma | పూల శోభతో తెలంగాణ ( Telangana ) అంతటా పండుగ వాతావరణం ఉట్టిపడుతుంది. సరిగ్గా ఈ ఆరో రోజు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేర్చే ఆడపడుచులు, ఈ ఒక్క రోజు మాత్రం పూలకు దూరంగా ఉంటారు. బతుకమ్మ పండుగలో అత్యంత ప్రత్యేకమైన ఘట్టంగా నిలిచే ఈ రోజు అమ్మవారిని ‘అలిగిన బతుకమ్మ’ లేదా ‘అర్రెం’ అని కొలుస్తారు. పల్లెల్లో ఎంతో ఉత్సాహంగా సాగే వేడుకల మధ్య ఈ ఒక్క రోజు బతుకమ్మలను ఎందుకు తయారు చేయరు? దీని వెనుక ఉన్న పౌరాణిక, చారిత్రక నేపథ్యం ఇదే..
Aligina Bathukamma | అపచారం జరిగిందని నమ్మకం..
పూర్వం బతుకమ్మను పేర్చే క్రమంలో అనుకోకుండా మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందని, ఆ కారణంగానే బతుకమ్మ అలిగి ఏదీ స్వీకరించదని భక్తుల నమ్మకం. అందుకే ఈరోజు ఎక్కడా బతుకమ్మలను తయారు చేయరు, ఎలాంటి నైవేద్యం కూడా సమర్పించరు. కేవలం అమ్మవారి అలక తీరాలని మాత్రమే మనసారా ప్రార్థిస్తారు.
Aligina Bathukamma | అలసిసొలసిన జగన్మాతకు విశ్రాంతి..
మరో పౌరాణిక గాథ ప్రకారం.. దేవీభాగవతం ఆధారంగా నవరాత్రుల్లో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాలు ధరించి భండాసురుడు, చండముండల వంటి రాక్షసులను సంహరించింది. ఆ రాక్షస సంహారంతో తీవ్రంగా అలసిసొలసిన జగన్మాతకు ఒక రోజు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆరో రోజు బతుకమ్మ ఆడరని చెబుతుంటారు. కాలక్రమేణా అదే ‘అలసిన బతుకమ్మ’గా, ఆ తర్వాత ‘అలిగిన బతుకమ్మ’గా రూపాంతరం చెందిందని పెద్దలు పేర్కొంటారు.
ఇది కూడా చదవండి: Kamareddy Traffic Problems | ట్రాఫిక్తో టెన్షన్..టెన్షన్.. కామారెడ్డి విస్తరణకు నోచుకోని రోడ్లతో అవస్థలెన్నో