అక్షరటుడే, వెబ్డెస్క్: Education for Peace | సామాజిక సామరస్యం, శాంతి, సమానత్వం, న్యాయం, అహింస, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను విద్యార్థుల్లో పెంపొందించి, శాంతియుత సమాజ నిర్మాణానికి పునాది వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని వక్తలు పేర్కొన్నారు.
పిల్లలకు చిన్నతనం నుంచే శాంతి, పరస్పర గౌరవం, భిన్నత్వాన్ని అంగీకరించడం, సహజీవనం వంటి విలువలను నేర్పించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం హైదరాబాద్లోని హబ్సిగూడలో ఉన్న ఆర్నాల్డ్ భవన్ శిక్షణా కేంద్రంలో ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్ (ISI), బెంగళూరు – COVA పీస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో అక్టోబర్ 15, 16, 17 తేదీలలో నిర్వహించిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది.
‘ఎడ్యుకేషన్ ఫర్ పీస్ – శాంతి విద్య, సామాజిక సామరస్యం’ అనే ప్రధాన అంశంపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 50 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
శాంతియుత సమాజ నిర్మాణానికి, శాంతిని బోదించటానికి విద్య ఎంతోఅవసరం అని ఈ శిక్షణా కార్యక్రమంలో ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు డా. డెంజిల్ ఫెర్నాండెజ్, జాన్ శామ్యూల్, డా. సత్యం తలారి (స్టేట్ కోఆర్డినేటర్, తెలంగాణ & ఆంధ్రప్రదేశ్), COVA పీస్ నెట్వర్క్ ప్రతినిధులు డా. మజర్ హుస్సేన్, మహ్మద్ ఖలీం మరియు శైలేంద్ర బోర తదితరులు పాల్గొని వివిధ అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. పాఠశాలలు కేవలం విద్యాబోధనకు మాత్రమే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో మానవీయ విలువలు, సామాజిక బాధ్యత, ప్రజాస్వామిక దృక్పథం, పరస్పర గౌరవం పెంపొందించే కేంద్రాలుగా ఉండాలని సూచించారు.
కులం, మతం, భాష, ప్రాంతం, లింగం వంటి భిన్నత్వాల పట్ల గౌరవభావాన్ని పెంపొందించడం ద్వారా వివక్ష, అసహనం, ద్వేషం, హింస వంటి సమస్యలను తగ్గించవచ్చని వివరించారు.
పిల్లలు చిన్నతనం నుంచే ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం, విభేదాలను శాంతియుతంగా ఎదుర్కోవడం నేర్చుకోవాలని తెలిపారు. ఈ లక్ష్యాలను సాధించడంలో ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
Education for Peace | ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం–16పై అవగాహన
ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం–16 (SDG 16) అయిన శాంతి, న్యాయం, బలమైన సంస్థలు అనే అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. సమాజంలో శాంతి, న్యాయం, సమానత్వం, జవాబుదారీతనం, ప్రజాస్వామిక విలువలను బలోపేతం చేయడంలో విద్యాసంస్థల పాత్రను వివరించారు.
భారత రాజ్యాంగంలోని సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి మౌలిక విలువలను విద్యార్థులకు పరిచయం చేయడంతో పాటు, వాటిని దైనందిన జీవితంలో ఆచరించేలా ప్రోత్సహించాలని సూచించారు.
విద్యార్థుల్లో రాజ్యాంగ స్పృహ, మానవ హక్కుల పట్ల గౌరవం, ఇతరుల పట్ల సానుభూతి, సామాజిక బాధ్యతను పెంపొందించడం ద్వారా ప్రజాస్వామిక సమాజ నిర్మాణానికి తోడ్పడవచ్చని తెలిపారు.
Education for Peace | ప్రతి పాఠశాలలో పీస్ క్లబ్స్ ఏర్పాటు చేయాలి
పాఠశాలల్లో శాంతి విద్యను మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ప్రతి పాఠశాలలో ‘పీస్ క్లబ్స్’ (శాంతి సంఘాలు) ఏర్పాటు చేయాలని వక్తలు సూచించారు. ఈ క్లబ్స్ ద్వారా విద్యార్థులకు శాంతి, సామాజిక సామరస్యం, అహింస, సహనం, సహకారం, నాయకత్వ లక్షణాలు, సంఘర్షణల పరిష్కారం వంటి అంశాలపై అవగాహన కల్పించవచ్చని వివరించారు.
పీస్ క్లబ్స్ ఆధ్వర్యంలో చర్చలు, సమూహ కార్యక్రమాలు, సృజనాత్మక పోటీలు, శాంతి సందేశ ప్రచారాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో శాంతియుత దృక్పథాన్ని పెంపొందించవచ్చని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల మధ్య తలెత్తే విభేదాలను పరస్పర చర్చలు, అవగాహన, సహకారం ద్వారా పరిష్కరించుకునే వాతావరణాన్ని ఉపాధ్యాయులు కల్పించాలని సూచించారు.
Education for Peace | వివిధ అంశాలపై సమగ్ర శిక్షణ
ఈ మూడు రోజుల శిక్షణలో భాగంగా ఉపాధ్యాయులకు పలు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు. వాటిలో..
- సామాజిక సామరస్యం – పరిచయం (Introduction to Social Harmony)
- సామాజిక అంశాలపై వివిధ దృక్పథాలు, దిశలను అర్థం చేసుకోవడం (Understanding Perspectives and Directions)
- సంఘర్షణలు మరియు సామాజిక సామరస్యం (Conflict and Social Harmony)
- పిల్లలకు కౌన్సెలింగ్ చేసే పద్ధతులు (Child Counselling Techniques)
- శాంతి కార్యక్రమాలు మరియు సామాజిక సందర్భం (Peace Initiatives and Social Context)
- పాఠశాలల్లో పీస్ క్లబ్స్ ఏర్పాటు, నిర్వహణ (Formation of Peace Clubs in Schools)
ఈ అంశాలపై చర్చలు, పరస్పర అనుభవాల పంచుకోవడం, ఆచరణాత్మక సూచనల ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు. పాఠశాల స్థాయిలో శాంతి విద్యను ఎలా అమలు చేయాలి, విద్యార్థుల్లో సహనం, సహజీవన భావనలను ఎలా పెంపొందించాలి.. ? సంఘర్షణలను ఎలా గుర్తించి పరిష్కరించాలి..? అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
Education for Peace | శాంతి సందేశాన్ని పాఠశాలలకు తీసుకెళ్లాలి
మూడు రోజుల శిక్షణ ద్వారా పొందిన జ్ఞానం, అనుభవాలను ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో అమలు చేయాలని నిర్వాహకులు కోరారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు మానవీయ విలువలు, సామాజిక బాధ్యత, రాజ్యాంగ స్ఫూర్తి, శాంతియుత సహజీవనం వంటి అంశాలను బోధించడం ద్వారా భవిష్యత్తులో సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందని తెలిపారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
సమాజంలో విభేదాలు, అసహనం, వివక్ష వంటి సమస్యలను తగ్గించడానికి పాఠశాల స్థాయి నుంచే శాంతి విద్యను ప్రోత్సహించడం అవసరమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక సమాజం సమన్వయంతో పనిచేసినప్పుడే శాంతియుత, సామరస్యపూర్వక సమాజాన్ని నిర్మించగలమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులందరికీ పాల్గొన్న ధ్రువపత్రాలు (Participation Certificates) అందజేశారు.