Telangana Ration Scheme | రేషన్‌కార్డుదారులకు బిగ్ అప్‌డేట్.. సబ్సిడీపై 6 నిత్యావసర సరుకులు!

మార్కెట్లో రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే భారీ ఊరటనిచ్చేందుకు సిద్ధమవుతోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Ration Scheme | మార్కెట్లో రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే భారీ ఊరటనిచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా కేవలం బియ్యం మాత్రమే కాకుండా, గోధుమపిండి, కంది పప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం పొడి వంటి 6 రకాల ముఖ్యమైన సరుకులను తక్కువ ధరలకే (సబ్సిడీపై) అందించేందుకు కసరత్తు చేస్తోంది. అవసరమైతే కొన్ని వస్తువులను ఉచితంగా అందించే ప్రత్యామ్నాయాలపై కూడా ప్రభుత్వం యోచిస్తోంది.

Telangana Ration Scheme | ఉన్నత స్థాయి సమీక్ష..

సచివాలయంలో పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖల మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  ( Uttam Kumar Reddy ) ఈ అంశంపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. పేద ప్రజలపై ధరల భారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పడకుండా చూడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గతంలో విజయవంతంగా అమలు చేసిన ‘అమ్మహస్తం’ పథకం తరహాలోనే దీనిని పునరుద్ధరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సరుకుల కొనుగోలు, కుటుంబానికి ఇచ్చే పరిమాణం, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారంపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను కోరారు.

Telangana Ration Scheme | ఎల్‌నినో హెచ్చరికలు..

పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన ‘ఎల్‌నినో’ ప్రభావంతో భవిష్యత్తులో వర్షాభావం ఏర్పడి, వ్యవసాయ దిగుబడులు తగ్గి ధరలు అమాంతం పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితులను, ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఇప్పటికే మంత్రివర్గ ఉప-సంఘం ఏర్పాటయింది.

రాష్ట్రంలోని 3.42 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు భవిష్యత్తులో ఎలాంటి ఆహార కొరత రాకూడదనే ఉద్దేశంతో ఏకంగా 14 నెలలకు సరిపడా ఆహార ధాన్యాలను సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పీడీఎస్, మధ్యాహ్న భోజనం వంటి పథకాలకు ప్రతినెలా 2.38 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం కాగా.. ఇప్పటికే ప్రభుత్వ గోదాముల్లో 9.64 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వ ఉన్నాయి. కస్టమ్ మిల్లింగ్ రైస్ ద్వారా మరో 18.39 లక్షల మెట్రిక్‌ టన్నులు రావలసి ఉంది. ఇవన్నీ కలిపితే దాదాపు 28.03 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అందుబాటులోకి వస్తాయని, ఇది దాదాపు 14 నెలల రాష్ట్ర అవసరాలకు పూర్తిగా సరిపోతుందని అధికారులు అంచనా వేశారు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy | నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలి.. పోలీసులకు సీఎం సూచన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *