Punjab Assembly Controversy | పంజాబ్ అసెంబ్లీలో ‘మద్యం’ కలకలం.. సీఎం తాగొచ్చారని ప్రతిపక్షాల ఆరోపణలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Punjab Assembly Controversy | కార్మిక దినోత్సవం (May Day) సందర్భంగా కార్మికులకు నివాళులర్పించేందుకు పంజాబ్ అసెంబ్లీ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (CM Bhagwant Mann) మద్యం సేవించి సభకు వచ్చారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించడంతో సభలో గందరగోళం నెలకొంది.

ముఖ్యమంత్రి మద్యం మత్తులో ఉన్నారని, ఆయనకు తక్షణమే ఆల్కహాల్ పరీక్ష నిర్వహించాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీనిపై ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా స్పందిస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు రావడం దురదృష్టకరమని, సభలోని సభ్యులందరికీ డోప్ టెస్ట్ చేయాలని పట్టుబట్టారు. కార్మిక దినోత్సవం రోజు సీఎం తీరు సిగ్గుచేటని ఆయన విమర్శించారు. అయితే, ఈ డోప్ టెస్ట్ డిమాండ్‌ను స్పీకర్ తోసిపుచ్చారు.

Punjab Assembly Controversy | సీఎం స్పందన

విపక్షాల ఆరోపణలపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. ఇది కార్మికుల గౌరవార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశమని, సభ్యులందరూ సభా మర్యాదలను పాటించాలని ఆయన కోరారు. అనవసర రాజకీయాలకు తావు లేకుండా సభను సజావుగా సాగనివ్వాలని విజ్ఞప్తి చేశారు.

కాగా సభ కార్యకలాపాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా (Sukhpal Singh Khaira) ఫోన్ ఉపయోగించారని ఆరోపిస్తూ మాన్ అభ్యంతరం తెలపడంతో ఈ వివాదం మొదలైంది. దీనికి ప్రతిస్పందనగా గత సమావేశంలో సందర్శకుల గ్యాలరీలో కూర్చున్న మాన్ భార్యను ఖైరా ప్రస్తావించారు. ఈ సమయంలో మాన్ తడబడుతూ ఖైరాతో ‘‘ఆమె తన తప్పును సరిదిద్దుకుంది. ఆమె సభ సభ్యురాలు కాదు. మీరు నా కూతురిని కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ వ్యక్తి పిచ్చిగా వాగుతున్నాడు” అని అన్నారు. వాగ్వాదం పెరగడంతో మాన్ మద్యం సేవించి అసెంబ్లీకి వచ్చారని ఖైరా ఆరోపించారు.

దీనిని కూడా చదవండి : Jabalpur Boat Tragedy | ప్రాణం పోతున్నా బిడ్డను వీడలేదు.. జబల్‌పూర్‌లో కంటతడి పెట్టించే విషాదం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *