Dosa Global Ranking | ప్రపంచ వేదికపై స‌త్తా చాటిన మ‌న దోశ‌.. టాప్-50 పాన్‌కేక్స్ జాబితాలో మూడు భారతీయ రుచులు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dosa Global Ranking | భారతీయ వంటకాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దోశ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ వంటకాలపై సమీక్షలు చేసే టేస్ట్ అట్లాస్ మే 2026కి సంబంధించిన ‘టాప్ 50 ఉత్తమ పాన్‌కేక్స్’ జాబితాను విడుదల చేసింది.

ఈ జాబితాలో భారతీయ దోశలు (Indian Dosas) మూడు స్థానాలను దక్కించుకోవడం గర్వకారణంగా మారింది. ఈ ర్యాంకింగ్స్‌లో మసాలా దోశ 4.3 రేటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా 6వ స్థానంలో నిలిచింది. క్రిస్పీ దోశలో ఆలూ మసాలా, దానికి తోడు కొబ్బరి చట్నీ, సాంబార్ కలయిక విదేశీ ఆహార ప్రియులను కూడా ఆకట్టుకుంటోంది. సాధారణ దోశ 4.2 రేటింగ్‌తో 15వ స్థానంలో నిలవగా, పలుచగా కరకరలాడే పేపర్ దోశ 4.1 రేటింగ్‌తో 35వ స్థానాన్ని సొంతం చేసుకుంది.

Dosa Global Ranking | టాప్ 10లో భారతీయ దోశలు..

దక్షిణ భారతదేశంలో ప్రారంభమైన ఈ వంటకం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గ్లోబల్ ఫుడ్‌గా మారింది. విదేశాల్లో కూడా దోశలకు భారీ డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా అమెరికా (America), యూరప్ దేశాల్లో దోశ సెంటర్లు పెరుగుతున్నాయి. ఇక ఈ జాబితాలో లాట్వియాకు చెందిన ‘కార్టుపెలు పంకుకాస్’ మొదటి స్థానాన్ని దక్కించుకోగా, ఫ్రాన్స్‌కు చెందిన ‘క్రేప్స్’ వంటకాలు రెండో, మూడో, నాలుగో స్థానాలను కైవసం చేసుకున్నాయి. చైనాకు చెందిన ‘జియాన్ బింగ్’ ఐదో స్థానంలో నిలిచింది.

ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ, భారతీయ దోశలు టాప్-10లో చోటు దక్కించుకోవడం వాటి ప్రపంచవ్యాప్త ఆదరణకు నిదర్శనం. ఒకప్పుడు కేవలం అల్పాహారంగా భావించిన దోశ, ఇప్పుడు ఫ్యూజన్ రూపాల్లో కూడా అందుబాటులోకి వచ్చి అంతర్జాతీయ పాకశాస్త్రంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

ఇది కూడా చదవండి..: Explosion in Iran | ఇరాన్‌లో భారీ పేలుడు.. 14 మంది ఐఆర్‌జీసీ సైనికులు మృతి

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *