అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : National ST Commission | గిరిజనుల సమస్యల పరిష్కారానికి జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎన్సీఎస్టీ) అంకిత భావంతో కృషి చేస్తోందని కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ అన్నారు. జిల్లా(Nizamabad) పర్యటనకు విచ్చేసిన ఆయన కలెక్టరేట్లో పాలనాధికారి ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్యతో సమావేశం నిర్వహించారు.
National ST Commission | జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటన..
మొదట జిల్లాలోని సిరికొండ మండలంలోని సర్పంచ్ తండా, గడ్డమీది తండా, కొండాపూర్, గోప్యాతండాను, నవీపేట మండలంలోని మాన్ సింగ్ తండాలను జాటోతు హుస్సేన్ నాయక్ సందర్శించారు. గిరిజనులతో మమేకమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. తండాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.
National ST Commission | ఇళ్లు కేటాయించాలి
గిరిజన సంక్షేమం, హౌసింగ్, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, అటవీ, రెవెన్యూ, విద్య, వ్యవసాయం, మున్సిపల్ పరిపాలన, ఎక్సైజ్, పోలీసు శాఖలకు సంబంధించిన సమస్యలపై గిరిజనులతో జాటోతు హుస్సేన్ నాయక్ నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారి సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని సూచించారు. అర్హులైన గిరిజనులకు జాప్యానికి తావు లేకుండా పక్కా ఇళ్లను కేటాయించాలని, విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని అన్నారు. అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, ట్రైనీ కలెక్టర్ సురేష్, జాతీయ ఎస్టీ కమిషన్ డైరెక్టర్ కల్యాణ్ రెడ్డి, డీఆర్వో గీత, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: బీజేపీ వాళ్లకి..రోడ్డుపై కూర్చోవడం అలవాటు