అక్షరటుడే వెబ్‌డెస్క్: TASMAC Liquor Price Hike | తమిళనాడు ( Tamil Nadu )రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరిపే తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్ – TASMAC) మద్యం ప్రియులకు ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల మద్యం సీసాల రిటైల్ ధర (MRP) పై రూ.10 పెంచాలని నిర్ణయించింది.
TASMAC Liquor Price Hike | పర్యావరణ సెస్ విధింపు..
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మద్యం సీసాలపై ఇటీవల పర్యావరణ సెస్ విధించడంతో టాస్మాక్ ఈ ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకుంది. అయితే, వినియోగదారులు మద్యం తాగిన తర్వాత ఖాళీ సీసాలను రిటైల్ దుకాణాల్లో తిరిగి ఇచ్చేస్తే.. వారు అదనంగా చెల్లించిన రూ.10 పొందే అవకాశం (Buyback Scheme) కల్పించారు. ఈ కొత్త విధానం అమలుపై తయారీదారులు, డిపోలు, జిల్లా మేనేజర్లు, రిటైల్ దుకాణాల సిబ్బందికి టాస్మాక్ ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసింది. గతంలో నిలిచిపోయిన ఖాళీ సీసాల సేకరణను మళ్లీ పునఃప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసింది.
TASMAC Liquor Price Hike | అదనపు వసూళ్లకు అడ్డుకట్ట ..
మద్యం ధరలపై రూ.20 వరకు పర్యావరణ సెస్ విధించేందుకు రాష్ట్ర అసెంబ్లీ ఇదివరకే ఆమోదం తెలిపింది. అయితే, ఖాళీ సీసాల డిపాజిట్ పేరుతో కొందరు సిబ్బంది వినియోగదారుల నుంచి అనధికారికంగా అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమాలకు చెక్ పెట్టడానికే అధికారికంగా ఎంఆర్‌పిలోనే సెస్ విధానాన్ని అమల్లోకి తెచ్చామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. సిబ్బంది ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఎంఆర్‌పి కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
TASMAC Liquor Price Hike | రోజువారీ అలవెన్స్ ప్రకటన..
ప్రత్యేక వెండర్‌ను టెండర్ ద్వారా ఎంపిక చేసే వరకు ప్రస్తుత దుకాణ సిబ్బందే ఈ ఖాళీ సీసాలను సేకరిస్తారు. ఈ అదనపు పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని దుకాణాల స్థానాన్ని బట్టి రోజువారీ అలవెన్స్‌ను టాస్మాక్ ప్రకటించింది. దీని ప్రకారం చెన్నై కార్పొరేషన్ పరిధిలోని దుకాణాలకు రోజుకు రూ. 2,000, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు రూ. 1,800, మున్సిపాలిటీలు , పట్టణ పంచాయతీలకు రూ. 1,600, అలాగే గ్రామ పంచాయతీల్లోని దుకాణాలకు రోజుకు రూ. 1,500 చొప్పున అలవెన్స్‌గా చెల్లించనున్నారు.
TASMAC Liquor Price Hike | కార్మిక సంఘాల అభ్యంతరం..
టాస్మాక్ తీసుకున్న ఈ తక్షణ నిర్ణయంపై కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేక వెండర్‌ను నియమించకుండా ఖాళీ సీసాల సేకరణ భారాన్ని షాపు సిబ్బందిపై వేయడం సరికాదని ఏఐటీయూసీ అనుబంధ వర్కర్స్ అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వం ఇచ్చే రూ.2,000 దినసరి భత్యం అదనపు సిబ్బంది జీతాలు, సీసాల నిల్వ కోసం గదుల అద్దెకే సరిపోదని, కాబట్టి ఇంత త్వరగా ఈ విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Integrated Organic Farming | సమీకృత సేంద్రియ సాగు విధానం భేష్..