అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR comments | కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రెండున్నర ఏళ్ల పాలనలో చేసిన మోసాలు, అవినీతి కుంభకోణాలను చూసి ప్రజలు 20 ఏళ్ల వరకు ఆ పార్టీకి ఓటు వేయరన్నారు
ఉమ్మడి రంగారెడ్డి (Rangareddy) జిల్లా పార్టీ నేతలతో కేటీఆర్ శనివారం సమావేశం అయ్యారు. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపైన దిశా నిర్దేశం చేశారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ (Congress) పార్టీ అన్ని వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు. దీనికి తోడు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అవినీతి అరాచకాలు, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కమీషన్లు వసూలు చేస్తోందని విమర్శించారు. మంత్రులు స్వయంగా మైనింగ్ కుంభకోణాలు చేస్తున్నారని ఆరోపించారు.
KTR comments | బీజేపీపై విమర్శలు
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. కమర్షియల్ సిలిండర్ (Commercial Cylinder) ధరను ఒక్కరోజే రూ. వేయి పెంచడం ఇందుకు నిదర్శనమన్నారు. ఇష్టారాజ్యంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై ఎక్కడికక్కడ నిరసన తెలుపాలని సూచించారు. పెంచిన సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
KTR comments | పార్టీ బలోపేతంపై చర్చ
పార్టీ బలోపేతానికి సంబంధించిన పలు అంశాల పైన కేటీఆర్ నాయకులకు సూచనలు చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల నిర్మాణంలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చురుకైన పాత్ర పోషించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయకుండా చూడాలని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : Kavitha Political Statement | కాంగ్రెస్ను గద్దె దించుతాం.. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత

