Food Safety Raids | ఈ స్వీట్లు తింటే ఆస్పత్రికే.. అపరిశుభ్రతకు కేరాఫ్​ అడ్రస్​గా తయారీ కేంద్రాలు

నగరంలో స్వీట్లు, ఖారా తయారు చేసే కేంద్రాలపై టీజీ సేఫ్​ అధికారులు దాడులు చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Food Safety Raids | స్వీట్లు చూస్తేనే నోరూరించే రంగులు.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే.. కానీ వాటి తయారీ కేంద్రాల్లోకి ఒక్కసారి చూస్తే మాత్రం వాంతులు రావడం ఖాయం. నగరంలోని పలు స్వీట్లు, ఖారా తయారీ కేంద్రాలపై ఫుడ్​సేఫ్టీ అధికారులు దాడులు చేయగా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి.

Food Safety Raids | 14 బృందాలతో..

ఈనెల 3న హైదరాబాద్​ (Hyderabad) నుంచి వచ్చిన టీజీ సేఫ్​ అధికారులు పలు స్వీట్లు, ఖారా తయారు చేసే దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఏకకాలంలో సుమారు 14 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. వీరు నగరంలోని జిల్లా వ్యాప్తంగా మొత్తం 28 ఆహార సంబంధిత వ్యాపార సంస్థల్లో (స్పైసెస్ తయారీ యూనిట్లు, ప్యాకేేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు, స్వీట్ షాపులు, బేకరీలు, రెస్టారెంట్లు) ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.

Food Safety Raids | అధికారులే ఆశ్చర్యపోయేలా..

ఆయా స్వీట్లు, ఖారా తయారీ కేంద్రాల్లో అపరిశుభ్రమైన వాతావరణం చూసి అధికారులే ముక్కున వేలేసుకున్నారు. వంటగదుల్లో నేలపై వ్యర్థాలతో దుర్వాసన, బొద్దింకలు, ఈగలు, ఎలుకలు స్వేచ్ఛగా తయారీ కేంద్రాల్లో తిరుగుతుండడం అధికారులకు కనిపించింది. స్వీట్లు తయారు చేసిన ప్రాంతంలోనే ఎలుకల విసర్జితాలు ఉండడం, బొద్దింకలు తిరుగుతుండడం చూసిన అధికారులు స్వీట్లు శాంపిళ్లను తీసుకుని.. వాటిని సిబ్బంది చేత బయట పారేయించారు. ఇక ఫ్రిడ్జ్​లలో రోజుల తరబడి ఉంచిన ఆహార పదార్థాలు ఉండి దుర్వాసన వస్తుండడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Food Safety Raids | సిబ్బందికి మాస్కులు లేవు.. గ్లౌజ్​లు లేవు..

Food Safety Raids

తయారీ కేంద్రాల్లో స్వీట్లు, కారా తయారుచేసే వ్యక్తులు కనీసం గ్లౌజ్​లు, మాస్క్​లు లేకపోవడం అధికారుల దృష్టికి వచ్చింది. ఆహార పదార్థాలు తయారుచేసిన తర్వాత వాటిపై న్యూస్​ పేపర్లు కప్పి ఉంచడాన్ని అధికారులు పరిశీలించారు. గడువు ముగిసిన (Expired) ఆహార పదార్థాలను ఎక్కువకాలం నిల్వ ఉంచడాన్ని అధికారులు నోట్​ చేసుకున్నారు. సిబ్బంది కనీసం గ్లౌజ్​లు, మాస్క్​లు ఇవ్వకపోవడంపై ఆయా స్వీట్లు, కారా దుకాణాల యజమానులపై అధికారులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Food Safety Raids | 26 దుకాణాల్లో శాంపిళ్ల సేకరణ..

Food Safety Raids

కల్తీపై అనుమానంతో మొత్తం 26 నమూనాలను (Samples) సేకరించి ల్యాబ్‌కు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 9,645 కిలోల ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేసి ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు రూ. 17,28,495/- ఉంటుందని అంచనా. సరైన FSSAI లైసెన్సులు లేకుండా నడుస్తున్న మహారాజా స్వీట్ & బేక్స్ (మిర్చి కాంపౌండ్), పంచవటి స్వీట్స్ (దుబ్బ), శివ శక్తి ఐస్ క్రీమ్ (దుబ్బ), సాగర్ బేకరీ (ఆటోనగర్) ని తక్షణమే మూసివేయించారు.

Food Safety Raids | 13 సంస్థల లైసెన్సులు సస్పెన్షన్

ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చప్పన్ భోగ్ స్వీట్స్, రాధే మిఠాయి వాటిక, శ్రీ రాధే ఎంటర్‌ప్రైజెస్, ఎల్​పీ ప్రొడక్ట్స్, జునైరా ఫ్యామిలీ రెస్టారెంట్, ఖురేషియా హోటల్, వాటర్ సొల్యూషన్ కంపెనీ, జనతా ట్రేడర్స్, ఐరా ఫుడ్స్ & బెవరేజెస్‌, సుఖ్‌జిత్ స్టార్చ్ మిల్స్, శ్రీ అయ్యప్ప ట్రేడర్స్, మొఘ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్వాలిటీ స్వీట్స్ & చిక్కి/కెకె స్వీట్స్ సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేస్తూ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన మరో 12 సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, స్వల్ప లోపాలున్న మరో 3 సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, భవిష్యత్తులోనూ ఇటువంటి దాడులు కొనసాగుతాయని టీజీ సేఫ్  కమిషనర్ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: SC ST Act verdict | కులం పేరుతో దూషించిన కేసులో నిందితులకు 5 ఏళ్ల జైలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *