అక్షరటుడే వెబ్‌డెస్క్: HDFC Bank Parivartan | కశ్మీర్ వ్యాలీలోని వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్’ తమ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమం ‘పరివర్తన్’ ద్వారా సంచలన మార్పులు తీసుకువస్తోంది. స్థానిక ఐఎస్ఎపి ఇండియా ఫౌండేషన్, సిటిజన్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో మెరుగైన సాగు పద్ధతులు, ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలు , మార్కెటింగ్ సౌకర్యాలను రైతులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రాజెక్ట్ కింద ఏర్పాటైన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOs) ఉమ్మడిగా దాదాపు రూ. 5.2 కోట్ల వ్యాపార లావాదేవీలు సాధించగా, అందులో కేవలం ఒక్క ఎఫ్పిఓనే ఏకంగా రూ. 1.4 కోట్ల ఆదాయాన్ని గడించడం విశేషం. రైతులు పండించిన పంటలకు ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ చేసి నేరుగా విక్రయించేందుకు ‘సమర్కష్’ (SAMARKASH) అనే ప్రత్యేక బ్రాండ్‌ను కూడా ప్రారంభించారు.
HDFC Bank Parivartan | సాగుకు సాంకేతిక భరోసా..
పాంపోర్‌లో కశ్మీర్ ప్రత్యేకాత్మకమైన కుంకుమపువ్వు (Saffron) సాగు చేసే రైతులకు సోలార్ వాటర్ పంపులు, సోలార్ డ్రయర్లు అందిస్తూ సాగు విధానాల్లో మెరుగైన యాజమాన్య పద్ధతులను పరిచయం చేస్తున్నారు. అలాగే సరిహద్దు ప్రాంతమైన ఉరిలో కశ్మీరీ రెడ్ చిల్లీ పండించే రైతుల కోసం పాలీహౌస్ వ్యవసాయం, బిందు సేద్యం (Drip Irrigation) , సోలార్ డ్రైయింగ్ సదుపాయాలను కల్పించారు. సరిహద్దు గ్రామాల్లో నివసించే రైతు కుటుంబాల ఆర్థిక రక్షణకు ఈ చర్యలు ఎంతగానో తోడ్పడుతున్నాయి.
HDFC Bank Parivartan | మారిన మార్కెటింగ్..
యాపిల్, ఆక్రోట్ (Walnut) పంటల కోత అనంతరం నాణ్యత తగ్గకుండా గ్రేడింగ్, సార్టింగ్, డ్రైయింగ్ చేసేందుకు వీలుగా ఆధునిక సాంకేతిక యంత్రాలు, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. గతంలో పంట కోసిన వెంటనే తక్కువ ధరకు తెగనమ్ముకునే రైతులకు ఈ ప్రాసెసింగ్ కేంద్రాలు కొండంత అండగా నిలిచాయి. పండ్లు, మిర్చి, కుంకుమపువ్వు మాత్రమే కాకుండా పాలు, సాంప్రదాయ బేకరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌కు కూడా ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ మార్పుల వల్ల లాభసాటి వ్యాపారం సాధ్యపడుతుండటంతో స్థానిక యువత మళ్లీ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతోంది.
HDFC Bank Parivartan | రూ. 1,316 కోట్ల సీఎస్ఆర్ నిధులు ..
దేశంలో సరిహద్దు గ్రామాల అభివృద్ధి (Vibrant Villages Programme) ప్రోగ్రామ్‌లో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 498 సరిహద్దు గ్రామాలకు సీఎస్ఆర్ సేవలను విస్తరించింది. 2025–26లో రూ. 1,316.18 కోట్లు ఖర్చు చేయగా, ఇప్పటివరకు పరివర్తన్ ద్వారా మొత్తం రూ. 7,492 కోట్లు వెచ్చించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10.77 కోట్లకు పైగా ప్రజల జీవితాల్లో ఈ ప్రోగ్రామ్ మార్పు తెచ్చింది. మొత్తం 5 లక్షల మంది తక్కువ ఆదాయం ఉన్న రైతుల వార్షిక ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పరివర్తన్ పనిచేస్తోంది. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనాన్ని (Stubble Burning) అరికట్టేందుకు 3.26 లక్షల ఎకరాల భూమిలో యంత్రాలను అందుబాటులోకి తెచ్చి 86,000 మంది రైతులకు సహాయం అందించారు.
ఇది కూడా చదవండి: Eagle Force | ఒడిశా నుంచి గంజాయి.. 400 కిలోలు అమ్మిన ముఠా