Tonbo Imaging IPO | వీక్ మార్కెట్‌లోనూ అదరగొట్టిన ఐపీవో.. 66 శాతం లాభాలను అందించిన ‘టోన్బో’

బలహీన మార్కెట్‌లోనూ డిఫెన్స్ సెక్టార్‌కు చెందిన టోన్బో ఇమేజింగ్ కంపెనీ ఐపీవో అదరగొట్టింది. కంపెనీ షేర్లు 66 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tonbo Imaging IPO | టోంబో ఇమేజింగ్ ఇండియాను 2003 లో స్థాపించారు. ఇది అభివృద్ధి చెందుతున్న ఒక ప్రపంచ రక్షణ ఎలక్ట్రానిక్స్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్ కంపెనీ. రక్షణ రంగ అనువర్తనాల కోసం ఎలక్ట్రో ఆప్టిక్ మరియు ఎలక్ట్రానిక్ వ్యవస్థలను డిజైన్ చేసి, తయారు చేస్తుంది.

దీని ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్స్, వెపన్ సైట్స్, హ్యాండ్‌హెల్డ్ థర్మల్ ఇమేజింగ్ బైనాక్యులర్స్, టార్గెటింగ్ సిస్టమ్స్, మిస్సైల్ సీకర్స్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్, మిస్సైల్ గైడెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. 24 దేశాలలోని రక్షణ మరియు భద్రతా సంస్థలకు 28 వేలకు పైగా క్షేత్రస్థాయిలో మోహరించిన సిస్టమ్‌ల ద్వారా సేవలు అందిస్తోంది. కంపెనీ సాంకేతికతలను నిఘా, గూఢచర్యం, లక్ష్య నిర్ధారణ, ఇతర సైనిక అనువర్తనాలలో ఉపయోగిస్తున్నారు.

Tonbo Imaging IPO | భారీ స్పందన..

కంపెనీ ఐపీవో (IPO) ద్వారా మొత్తం రూ. 852.18 కోట్లు సమీకరించింది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ అయినా ఈ ఐపీవోకు ఇన్వెస్టర్లనుంచి భారీ మద్దతు లభించింది. మొత్తం కోటా 132.81 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇందులో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ విభాగం 293.56 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీ 170.94 రెట్లు, రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్ విభాగం 31.06 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి.

Tonbo Imaging IPO | బలమైన లిస్టింగ్..

టోన్బో ఇమేజింగ్ ఇండియా షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీలలో బలంగా ప్రారంభమయ్యాయి. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరును రూ. 700 లకు విక్రయించగా.. ఎన్ఎస్ఈలో రూ. 460 ప్రీమియంతో రూ. 1,160 వద్ద.. బీఎస్ఈ లో రూ. 462 ప్రీమియంతో రూ. 1,162 వద్ద లిస్టయ్యాయి. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలోనే సుమారు 66 శాతం లాభాలు వచ్చాయన్న మాట. లిస్టింగ్ తరువాత టోన్బో ఇమేజింగ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 6,656.18 కోట్లుగా ఉంది. కాగా మార్కెట్ అనిశ్చితుల కారణంగా లిస్టయ్యాక కంపెనీ షేర్లు కాస్త తగ్గాయి. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో 52.85 శాతం లాభంతో 1,070 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి..: Indian Stock Market | ఆగని పతనం.. నష్టాల్లోనే సూచీలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *