అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Godavari Pushkaralu | గోదావరి పుష్కరాల పనులను వేగవంతం చేయాలని ప్రత్యేక అధికారి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు సూచించారు. శుక్రవారం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi), అదనపు కలెక్టర్ భుజంగరావు ఇతర అధికారులతో కలిసి కందకుర్తి పుష్కర ఘాట్‌ను సందర్శించారు.
Godavari Pushkaralu | పనుల పరిశీలన..
దేవాదాయ, నీటిపారుదల, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను పరిశీలించిన హనుమంతరావు అధికారులకు కీలక సూచనలు చేశారు. పుష్కరాల నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ వేగవంతం చేయాలని ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండాలన్నారు. ఒక్కో శాఖ వారీగా చేపట్టిన పనుల వివరాలు సమీక్షించి, మార్పులు చేర్పులకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు.
Godavari Pushkaralu | ఆలయాల అభివృద్ధి..
ఆలయాల అభివృద్ధి, నవీకరణ, నూతన పుష్కర ఘాట్ల నిర్మాణం, ఘాట్ల మరమ్మతులు, రోడ్ల నిర్మాణం, తాగునీటి వసతి, పార్కింగ్, వీఐపీ ఘాట్ నిర్మాణం తదితర పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ప్రత్యేక అధికారి అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. జిల్లాలోని కందకుర్తి, యంచ తదితర గోదావరి పరీవాహక పుణ్యక్షేత్రాల వద్ద పుష్కరాలు నిర్వహించే అన్ని ప్రాంతాల్లో పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు.
Godavari Pushkaralu | కందకుర్తి వద్ద గోదావరి ప్రవాహం..
కందకుర్తి వద్ద గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నందున కొత్త పుష్కరఘాట్ నిర్మాణానికి మరికొంత సమయం పడుతుందని కలెక్టర్ అన్నారు. నీటి మట్టం తగ్గిన మీదట పుష్కర ఘాట్ పనులు చేపట్టి రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. మిగితా పనులను వెంటదివెంట చేపట్టి, మైల్ స్టోన్ ప్రకారం పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామని, మార్చి నెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తయ్యేలా స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తున్నామని అన్నారు. స్పెషల్ ఆఫీసర్ వెంట బోధన్ ఆర్డీవో విజయకుమారి, పంచాయతీరాజ్, ఆర్ అండ్‌బీ, ఇరిగేషన్, ఎండోమెంట్ తదితర శాఖల అధికారులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Indalwai Toll Gate | వాహనదారులూ జాగ్రత్త.. ఇందల్వాయి టోల్గేట్ వద్ద రూ.300 ‘ఫాస్టాగ్’ దోపిడీ!