అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Water Crisis | హైదరాబాద్ (Hyderabad) నగరంలో అప్పుడే తాగునీటి కష్టాలు మొదలు అయ్యాయి. భూగర్భ జలాలు పడిపోవడంతో నగరవాసులు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు.
ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురువలేదు. దీంతో భూగర్భ జలాలు అంతంతమాత్రంగానే వృద్ధి చెందాయి. దీంతో నవంబర్ ప్రారంభంలోనే నగరంలో నీటి ఎద్దడి మొదలైంది. హైదరాబాద్లో ప్రతి ఏడాది వేసవిలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతారు. ఇప్పుడు చలికాలంలోనే కష్టాలు మొదలు అవడంతో రానున్న రోజుల్లో.. ఎలా అనే ఆందోళన నెలకొంది.
Hyderabad Water Crisis | ఖాళీగా జలాశయాలు
హైదరాబాద్ నగరానికి తాగు నీరు సరఫరా చేసే జలాశయాలు సైతం ఖాళీగా ఉన్నాయి. ఎల్లంపల్లి మినహా మిగతా ప్రాజెక్ట్లు వెలవెలబోతున్నాయి. సింగూరు డెడ్ స్టోరేజీకి చేరువలో ఉంది. మరోవైపు భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోయాయి. జలమండలి నల్లాల ద్వారా సరఫరా చేసే నీరు సరిపోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జలమండలి, ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు.
Hyderabad Water Crisis | రోజుకు 7 వేల ట్యాంకర్ల బుకింగ్
జలమండలి నుంచి అక్టోబర్ నెలలోనే 2.2 లక్షల వాటర్ ట్యాంకర్లను ప్రజలు బుక్ చేసుకున్నారు. రోజుకు దాదాపు 7 వేల ట్యాంకర్లు బుకింగ్ అవుతున్నట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది అక్టోబర్ నెలలో కేవలం 87 వేల ట్యాంకర్లు మాత్రమే బుక్ కాగా.. ఈ సారి దాదాపు 3 రెట్లు పెరగడం గమనార్హం. దీంతో భవిష్యత్లో నీటి కష్టాలు మరింత తీవ్రం కానున్నాయని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad Water Crisis | జలమండలి చర్యలు
తాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జలమండలి అధికారులు ముందు నుంచే చర్యలు చేపడుతున్నారు. నీటిని వృథా చేయకుండా అవగాహన కల్పిస్తున్నారు. వృథా చేసే వారికి భారీగా జరిమానాలు వేస్తున్నారు. మరోవైపు ఎస్టీపీల నుంచి శుద్ధి చేసిన జలాలను గృహేతర అవసరాలకు వినియోగించేందుకు గ్రీన్ ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. పార్కులు, నిర్మాణ పనులు, మొక్కలకు పట్టేందుకు ఈ నీటిని వినియోగిస్తున్నారు. మరోవైపు హైడ్రా సైతం భూగర్భ జలాలు పడిపోకుండా.. అక్రమ బోర్లపై కొరఢా ఝుళిపిస్తోంది. ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు ఔటర్ రింగ్ రోడ్డు బయట నుంచి నీటిని తెచ్చి నగరంలో విక్రయాలు చేపట్టాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి..: Metro Common Pass | ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్ ధరల తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..