అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Onion Prices | తెలంగాణలో గత కొంతకాలంగా ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది. ఇప్పటికే మిగతా కూరగాయల ధరలు మండిపోతుండగా, ఇప్పుడు ఉల్లి ధరలు కూడా రోజురోజుకూ పెరిగిపోవడం కొనుగోలుదారులను కలవరపెడుతోంది. గత నెలన్నర రోజులుగా మార్కెట్లో ధరల పెరుగుదల కొనసాగుతుండటంతో, గతంలో కేజీల కొద్దీ కొనుగోలు చేసిన వినియోగదారులు ప్రస్తుతం అత్యవసరానికి సరిపడా అర కేజీ, కేజీ మాత్రమే కొంటూ సరిపెట్టుకుంటున్నారు.
Telangana Onion Prices | హోల్‌సేల్ రేటు..
ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లలో ఉల్లి నాణ్యతను బట్టి కిలో రూ.25 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. అయితే రిటైల్ మార్కెట్లకు వచ్చేసరికి ఆ ధర ఏకంగా రూ.60 నుంచి రూ.80 వరకు చేరుతోంది. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు నాణ్యమైన ఉల్లిని వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఇష్టారాజ్యంగా విక్రయిస్తుండటంతో జనం జేబులకు చిల్లులు పడుతున్నాయి.
Telangana Onion Prices | పొరుగు రాష్ట్రాల దిగుబడులపైన..
తెలంగాణలో ఉల్లి వినియోగం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, స్థానిక ఉత్పత్తి అవసరాలకు తగినంతగా ఉండదు. దీంతో రాష్ట్రం ప్రధానంగా మహారాష్ట్ర (నాసిక్, లాసల్గావ్), కర్ణాటక ( Karnataka ), ఆంధ్రప్రదేశ్ (కర్నూలు) నుంచి వచ్చే దిగుమతులపైనే ఆధారపడుతోంది.
గత రెండేళ్లుగా సరైన లాభాలు లేక రైతులు ఉల్లి సాగు విస్తీర్ణాన్ని తగ్గించారు. ఈ ఏడాది పొరుగు రాష్ట్రాల్లో దిగుబడులు తగ్గడం, పంట కోతలు ఆలస్యం కావడం , రవాణా అడ్డంకులు ఏర్పడటంతో తెలంగాణకు రావాల్సిన సరుకు గణనీయంగా తగ్గిపోయింది. డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో నిల్వలు అడుగంటి ధరలు విపరీతంగా పెరిగాయి.
Telangana Onion Prices | పంట దెబ్బతీసిన ఎల్‌నినో..
ధరల మంటకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షపాత లోటు, అధిక ఉష్ణోగ్రతలు ఉల్లి సాగును దెబ్బతీశాయి. ఉల్లి పంట మొలకెత్తే దశ నుంచి గడ్డ పెరిగే వరకు నిరంతర తేమ, నీటి సరఫరా అత్యంత అవసరం. మహారాష్ట్ర వంటి ప్రధాన ఉల్లి ఉత్పత్తి కేంద్రాల్లో వాతావరణం అనుకూలించకపోవడంతో దేశవ్యాప్తంగా ఉల్లి సరఫరాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.
Telangana Onion Prices | కొత్త పంట వస్తేనే ..
రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు తగ్గుతాయా లేదా మరింత పెరుగుతాయా అనేది పూర్తిగా పొరుగు రాష్ట్రాల నుంచి రావాల్సిన కొత్త పంటపైనే ఆధారపడి ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీల నుంచి కొత్త ఉల్లి మార్కెట్లకు భారీగా వస్తే తప్ప ధరలు అదుపులోకి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వాతావరణ మార్పుల వల్ల పంట కోతలు మరికొంత కాలం ఆలస్యమైతే లేదా దిగుబడి తగ్గితే, ఈ అధిక ధరల భారం మరికొన్ని వారాల పాటు కొనసాగవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ata Electronics Plant | టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో ప్రమాదం.. విషవాయువు పీల్చి ముగ్గురు మృతి