అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Land Resurvey | జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో కొనసాగుతున్న రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Land Resurvey | సర్వే విధానం పరిశీలన..
సర్వే బృందాలు చేపడుతున్న కొలతల విధానం, సరిహద్దుల నిర్ధారణ, రికార్డుల పరిశీలన తదితర అంశాలను క్షుణ్ణంగా గమనించి, అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. ఈ ప్రక్రియకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. గ్రామ సరిహద్దుల నిర్ధారణ చేసే సమయంలోనే సమాంతరంగా ప్రభుత్వ భూముల సర్వేను సైతం చేపట్టి హద్దులను నిర్ణయించి పక్కాగా గుర్తులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఫారెస్టు భూముల సర్వే ప్రక్రియను అటవీ శాఖ అధికారుల సమక్షంలో నిర్వహించాలని అన్నారు. తప్పిదాలకు తావులేకుండా వేగవంతంగా రీసర్వే జరిపిన సర్వేయర్లను ఎంపిక చేసి నగదు పారితోషికాలు అందజేస్తామని ప్రకటించారు. ఈ నెలాఖరులోపు నిర్దేశిత లక్ష్యాలను అధిగమించిన వారికి మొదటి బహుమతి కింద రూ.10వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 5వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి రూ. 3వేలు, నాలుగు, ఐదవ స్థానంలో ఎంపికైన వారికి రూ.2వేలు, వేయి నగదు పారితోషికం అందజేస్తామని అన్నారు.
Land Resurvey | గడువు సమీపిస్తున్న దృష్ట్యా..
గడువు సమీపిస్తున్న దృష్ట్యా సెలవు దినాల్లో సైతం రీసర్వే ప్రక్రియను కొనసాగించాలని, తాను కూడా క్షేత్రస్థాయి పరిశీలనలు జరుపుతానని కలెక్టర్ స్పష్టం చేశారు. భూ యజమానులు, రైతులు కూడా భూ రీసర్వే ప్రక్రియకు పూర్తిస్థాయిలో సహకరించాలని, ఏవైనా సందేహాలు, అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రీసర్వే పనుల్లో ఖచ్చితత్వం, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తద్వారా భూ వివాదాలు సమసిపోయి, రైతులకు వారి భూములపై ఖచ్చితమైన హక్కుల నిర్ధారణ అవుతుందన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రాజాగౌడ్, బోధన్ ఆర్డీవో విజయ కుమారి, వర్ని తహశీల్దార్ ప్రశాంత్, సర్పంచ్ లక్ష్మణ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు, గ్రామ పెద్దలు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Fake Death Certificate | భార్య పేరిట నకిలీ డెత్ సర్టిఫికెట్.. ప్లాట్ అమ్మేసిన భర్త అరెస్ట్..