Fake Death Certificate | భార్య పేరిట నకిలీ డెత్​ సర్టిఫికెట్​.. ప్లాట్​ అమ్మేసిన భర్త అరెస్ట్​..

భార్య బతికి ఉండగానే.. నకిలీ డెత్​ సర్టిఫికెట్ సృష్టించి ఆమె పేరిట ఉన్న ప్లాట్​ను ఓ వ్యక్తి అమ్మేశాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: Fake Death Certificate | సమాజంలో ఆస్తుల కోసం కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. బతికి ఉన్న భార్య చనిపోయిందని నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించిన ఓ భర్త తన భార్య పేరు మీద ఉన్న ప్లాట్‌ను అమ్మేశాడు. ఈ ఘటనలో భర్తను ఆర్మూర్ పోలీసులు (Armoor Police) అరెస్ట్ చేశారు. ఆర్మూర్ పోలీస్​స్టేషన్​లో ఎస్​హెచ్​వో చంద్రశేఖర్ రెడ్డి నిందితుడి వివరాలను వెల్లడించారు.

Fake Death Certificate | దూరంగా ఉంటుండటంతో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెర్కిట్‌కు చెందిన దేశాయిపేట రవి (45)కి 2017లో బీర్కూర్ చెందిన గీతాంజలితో వివాహం జరిగింది. వారికి కుమారుడు మోక్షిత్ ఉన్నాడు. దంపతుల మధ్య గొడవలు రావడంతో గీతాంజలి కుమారుడితో కలిసి తల్లి ఇంటి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఆర్మూర్ నగరంలోని కోటార్మూర్ ప్రాంతంలో సర్వే నంబర్ 212/అ, 212/ఆ లేఅవుట్‌లో ఫ్లాట్ నంబర్–4లోభార్య గీతాంజలి పేరు మీద ఉన్న సుమారు 267 గజాల స్థలాన్ని ఎలాగైనా అమ్మేసి లాభపడాలని రవి పథకం వేశాడు. డాక్యుమెంట్ రైటర్‌గా ఉన్న అనుభవాన్ని ఆసరాగా చేసుకుని, తన ఆఫీసులోని కంప్యూటర్‌లో భార్య చనిపోయినట్లుగా నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించాడు. దానికి అనుబంధంగా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల సమక్షంలో భార్య చనిపోయినట్లు మరణ వాంగ్మూల ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నాడు. వాటి ఆధారంగా అప్పటి తహశీల్దార్​ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందాడు.

Fake Death Certificate | గిఫ్డ్ డీడ్​ రూపంలో తల్లి పేరుపై బదిలీ..

అనంతరం ఇద్దరిని సాక్షులుగా ఉంచుతూ, భార్య పేరు మీద గల ప్లాట్‌ను 2025లో ఆర్మూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గిఫ్ట్ డీడ్ రూపంలో తన తల్లి లక్ష్మీబాయి పేరిట బదిలీ చేయించాడు. తర్వాత తల్లి పేరు మీద ఉన్న ఆ స్థలాన్ని మరొకరికి రూ.15 లక్షలకు సేల్ డీడ్ రూపంలో అమ్మేశాడు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకునే ఉద్దేశంతో కూడా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. భార్య గీతాంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రవిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ హెచ్ఓ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్సై రజినీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Power Cut | 15న నగరంలో విద్యుత్​ సరఫరాలో అంతరాయం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *