Delhi Showroom Murder | ఢిల్లీలో షాకింగ్ ఘటన.. షోరూమ్ ట్రయల్ రూమ్‌లో యువతి దారుణ హత్య

దేశ రాజధాని ఢిల్లీలో మరో కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Delhi Showroom Murder | దేశ రాజధాని ఢిల్లీలో మరో కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. బట్టల షోరూమ్‌లో పనిచేస్తున్న 17 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. షోరూమ్‌లోని ట్రయల్ రూమ్‌లో ఆమె గొంతు కోసిన స్థితిలో విగతజీవిగా పడి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పశ్చిమ ఢిల్లీ (Delhi)లోని మోతీ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఓ గార్మెంట్ షోరూమ్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతురాలిని షబ్నమ్‌గా గుర్తించారు. ఈ హత్యకు సూరజ్ అనే వ్యక్తే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, ఏకపక్ష ప్రేమ, వ్యక్తిగత విభేదాలే ఈ ఘాతుకానికి దారితీసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Delhi Showroom Murder | పరారీలో నిందితుడు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం షోరూమ్ మూసివేసే సమయానికి సూరజ్ అక్కడకు వచ్చాడు. తన వెంట పదునైన ఆయుధాన్ని తెచ్చిన నిందితుడు.. షబ్నమ్‌తో మాట్లాడాలనే నెపంతో ఆమెను ట్రయల్ రూమ్‌లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమె గొంతు కోసి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. రాత్రి 9 గంటల సమయంలో షోరూమ్ సిబ్బంది పరిశీలించగా.. షబ్నమ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

Delhi Showroom Murder | కొంతకాలంగా మనస్పర్థలు..

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. షబ్నమ్, సూరజ్‌లకు గతంలో పరిచయం ఉందని, అయితే కొంతకాలంగా వారి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు విచారణలో తేలింది. నిందితుడు గతంలోనూ తన కుమార్తెపై దాడి చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఇది కూడా చదవండి..: Birsa Munda Jayanti | ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *