అక్షరటుడే, భీమ్‌గల్: Land Resurvey | భూముల రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (collector ila tripathi) అధికారులను ఆదేశించారు. ఆదివారం భీమ్‌గల్ మండలంలోని బాచన్‌పల్లిలో కొనసాగుతున్న రీసర్వే పనులను అదనపు కలెక్టర్ రాజాగౌడ్‌తో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Land Resurvey | సర్వేపై సమగ్ర పర్యవేక్షణ..
ఈ సందర్భంగా భూ హద్దుల నిర్ధారణ, విస్తీర్ణం కొలతలు, రికార్డులతో వివరాల సరిపోలిక తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యజమానుల వివరాలు, సర్వే నంబర్లు, విస్తీర్ణం, హద్దుల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావుండకూడదన్నారు. భూ యజమానులకు ముందస్తు సమాచారం ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేయాలని, అభ్యంతరాలుంటే తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నాణ్యతా ప్రమాణాలతో పనులు వేగవంతం చేయాలన్నారు.
రీసర్వే కోసం జిల్లాకు మరిన్ని రోవర్ యంత్రాలు తెప్పిస్తున్నామని, అదనపు బృందాలను ఏర్పాటు చేసి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి ప్రతినెలా నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, సర్వే, భూ రికార్డుల శాఖ ఏడీ అశోక్, తహసీల్దార్ కిరణ్, రెవెన్యూ, సర్వే సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: 5k రన్ చేశాడు..ఇంగ్లీషులో ఇరగదీశాడు