అక్షరటుడే, వెబ్డెస్క్: Birsa Munda Jayanti | గిరిజనుల ఆత్మగౌరవం, హక్కుల కోసం బ్రిటిష్ పాలకులపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.
జనజాతీయ గౌరవ్ దివస్ మరియు జార్ఖండ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం న్యూఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తదితరులు బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకల్లో భాగంగా కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ గిరిజన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
Birsa Munda Jayanti | బిర్సా ముండా త్యాగం స్ఫూర్తిదాయకం..
బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగం భవిష్యత్ తరాలకు ఎప్పటికీ ఆదర్శమని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా గిరిజన సమాజ అభివృద్ధి, సంక్షేమం, సమాన అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందిస్తూ.. గిరిజన నాయకుల చారిత్రక సేవలను, గొప్ప వారసత్వాన్ని స్మరించుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశమని, ఆధునిక అభివృద్ధితో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
Birsa Munda Jayanti | నినాదంతో గిరిజనుల్లో చైతన్యం..
1875 నవంబర్ 15న జన్మించిన బిర్సా ముండా, బ్రిటిష్ అణచివేతకు వ్యతిరేకంగా గిరిజనులను ఏకతాటిపైకి తెచ్చి ‘అబువా దిషుమ్, అబువా రాజ్’ (మా భూమి.. మా పాలన) అనే నినాదంతో పోరాటాన్ని ఉధృతం చేశారు. ఆయన జన్మదినమైన నవంబర్ 15నే 2000 సంవత్సరంలో బీహార్ నుంచి విడిపోయి జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం విశేషం. దేశ నిర్మాణంలో గిరిజనుల పాత్రను, బిర్సా ముండా అసమాన ధైర్యసాహసాలను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.
WATCH🚨: Prime Minister Shri Narendra Modi paid floral tributes and homage to Dharti Aaba Bhagwan Birsa Munda on his birth anniversary and on the occasion of ‘Janjatiya Gaurav Diwas’ at his statue in the Parliament premises. https://t.co/l3Q5Ym6J4s
— The Sarpanch (@TheSarpanchIND) November 15, 2026
ఇది కూడా చదవండి..: Shubhanshu Shukla | 2040 నాటికి చంద్రుడిపై భారత త్రివర్ణ పతాకం ఎగరడమే నా అతిపెద్ద కల: వ్యోమగామి శుభాంశు శుక్లా