India Electronics Market | టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఓమ్నిఛానెల్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ ‘క్రోమా’ (Croma), గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ ‘కీర్నీ’ (Kearney)తో కలిసి ‘హౌ ఇండియా అప్‌గ్రేడ్స్’ (How India Upgrades) పేరుతో ఒక ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ వినియోగ తీరు ఎలా మారుతోంది, రాబోయే కాలంలో ఏయే అంశాలు మార్కెట్‌ను శాసించనున్నాయనే విషయాలను ఈ నివేదిక స్పష్టం చేసింది. దీని ప్రకారం.. భారత ఎలక్ట్రానిక్స్ మార్కెట్ 2024 నాటికి ఉన్న ₹7 ట్రిలియన్ల (రూ. 7 లక్షల కోట్లు) నుంచి, 2030 నాటికి సుమారు ₹10 ట్రిలియన్లకు (రూ. 10 లక్షల కోట్లకు) చేరుకోనుంది.
India Electronics Market | నివేదికలోని అంశాలు..
చిన్న నగరాల్లోనే జోరు: మెట్రో నగరాలతో పోలిస్తే టైర్-2, టైర్-3 నగరాల్లో ఎలక్ట్రానిక్స్ విక్రయాలు దాదాపు రెట్టింపు వేగంతో దూసుకుపోతున్నాయి. క్రోమా విక్రయాల ప్రకారం.. 2022-2025 మధ్య కాలంలో టైర్-3 నగరాల్లో 40%, టైర్-2 నగరాల్లో 30%, టైర్-1 నగరాల్లో 35% చొప్పున వృద్ధి నమోదైంది. చిన్న నగరాల వాటా 32% నుంచి 44%కి పెరిగింది.
ప్రీమియం వైపు వినియోగదారుల మొగ్గు: కేవలం మొబైల్ ఫోన్లే కాకుండా ఖరీదైన, అధునాతన ఫీచర్లు ఉన్న గాడ్జెట్లను కొనుగోలు చేసేందుకు భారతీయులు ఆసక్తి చూపుతున్నారు. క్రోమాలో 2021-2025 మధ్య స్మార్ట్ఫోన్ల సగటు విక్రయ ధర 34% పెరిగింది. అలాగే రూ. 50,000 పైబడిన ప్రీమియం ఫోన్ల కొనుగోళ్లు 26% వృద్ధిని నమోదు చేశాయి.
మారుతున్న గృహోపకరణాల ప్రమాణాలు: ఒకప్పుడు లగ్జరీగా భావించిన ఇన్వర్టర్ ఏసీలు (Inverter ACs) ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ స్టాండర్డ్‌గా మారిపోయాయి. అలాగే 2015లో ప్రతి 25 టీవీలలో ఒకరు మాత్రమే 55 అంగుళాలు లేదా అంతకంటే పెద్ద టీవీలను కొనుగోలు చేయగా.. 2025 నాటికి ప్రతి ముగ్గురిలో ఒకరు పెద్ద స్క్రీన్ టీవీలనే ఎంచుకున్నారు.
India Electronics Market | కొత్త గ్యాడ్జెట్ల ఎంట్రీ..
డిష్వాషర్లు, డ్రైయర్లు, గేమింగ్ డివైజ్‌లు, హియర్బిల్స్ (హెడ్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్), ఎయిర్ ఫ్రైయర్స్ వంటి ఆధునిక వస్తువుల వాడకం భారతీయ కుటుంబాల్లో వేగంగా పెరుగుతోంది.
ఈ సందర్భంగా క్రోమా ఎండీ & సీఈఓ శిబాశిష్ రాయ్ మాట్లాడుతూ.. గత రెండు దశాబ్దాలుగా భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ మార్కెట్ ఎంతో మార్పు చెందిందని, వినియోగదారులు కేవలం అవసరం కోసం కాకుండా అనుభూతి, ఆకాంక్షల కోసం అప్‌గ్రేడ్ అవుతున్నారని తెలిపారు. కీర్నీ ఇండియా ( India ) ఛైర్మన్ కౌశిక్ మాధవన్ మాట్లాడుతూ.. ప్రీమియం ఉత్పత్తులు, చిన్న నగరాల విస్తరణ భవిష్యత్తులో దేశ ఎలక్ట్రానిక్స్ వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.