అక్షరటుడే వెబ్‌డెస్క్: Karur Vysya Bank Branches | భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన కరూర్ వైశ్యా బ్యాంక్ (KVB) తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ఒకేసారి 8 కొత్త శాఖలను ప్రారంభించి, తన మొత్తం శాఖల నెట్‌వర్క్‌ను 929కి పెంచుకుంది. మెట్రో నగరాలు, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు రిటైల్, ఎంఎస్ఎంఈ, వ్యవసాయ బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు.
Karur Vysya Bank Branches | కొత్తగా రెండు శాఖలు..
ఈ విస్తరణలో భాగంగా తెలంగాణలో రెండు కొత్త శాఖలను అందుబాటులోకి తెచ్చారు. బాచుపల్లిలోని నిజాంపేట రోడ్డులో ఉన్న SSV క్యాపిటల్ భవనంలో ఏర్పాటు చేసిన శాఖను ‘ప్రగతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్’ చైర్మన్ డి. దయాకర్ రెడ్డి, డాక్టర్ రంజితా నాదెండ్ల కలసి సంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అలాగే వికారాబాద్ జిల్లా తాండూరులోని ముధెల్లి నారాయణ్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన శాఖను రాడికల్ బయో-ఆర్గానిక్స్ డైరెక్టర్ కల్వ రాధాకృష్ణ, బిచాల జ్యోతి ప్రారంభించగా, ‘సేఫ్ రూమ్’ను గ్రెయిన్ అండ్ సీడ్స్ మెర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్కం వీరేందర్ ప్రారంభించారు.
Karur Vysya Bank Branches | మిగతా రాష్ట్రాల్లో వివరాలు..
తెలంగాణలోని ( Telangana) 2 శాఖలతో పాటు తమిళనాడులో 3 (చెన్నైలోని చూలై, తిరుకళుకుండ్రం, తిరుచిరాపల్లిలోని వైయంపట్టి), కర్ణాటకలో 2 (బెంగళూరులోని నాగరభావి, హులిమావు), ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో 1 శాఖను ప్రారంభించారు. ఆగ్రాలోని కొత్త శాఖను బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ రమేష్ బాబు స్వయంగా ప్రారంభించారు.
రమేష్ బాబు (MD & CEO) స్పందన..
ఈ సందర్భంగా సీఈఓ రమేష్ బాబు మాట్లాడుతూ.. భౌతిక శాఖల విస్తరణకు తోడు డిజిటల్ బ్యాంకింగ్‌ను బలోపేతం చేయడం ద్వారా వినియోగదారులకు మరింత వేగవంతమైన, నాణ్యమైన సేవలను అందిస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా మెట్రో నగరాలు, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్, ఎంఎస్ఎంఈ, వ్యవసాయ రంగాల్లో బ్యాంకుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
Karur Vysya Bank Branches | కరూర్ వైశ్య బ్యాంక్ రికార్డు..
బ్యాంక్ సాధిస్తున్న నిరంతర ఆర్థిక వృద్ధికి ఈ వ్యాపార విస్తరణ అద్దం పడుతోంది. సెప్టెంబర్ 30, 2026 నాటికి KVB మొత్తం వ్యాపారం రూ. 2,39,712 కోట్లకు చేరుకుంది. ఇందులో డిపాజిట్లు రూ. 1,28,123 కోట్లు కాగా, అడ్వాన్సులు రూ. 1,11,589 కోట్లుగా నమోదయ్యాయి. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY27) రెండో త్రైమాసికంలో బ్యాంక్ రూ. 788 కోట్ల నికర లాభాన్ని ఆర్జించి, గత ఏడాదితో పోలిస్తే 37.28 శాతం వృద్ధిని సాధించింది.
ఇది కూడా చదవండి: Traffic-Free City | హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చాలి : సీఎం రేవంత్‌రెడ్డి