Talari Balaiah | కష్టాల కొలిమిలోంచి న్యాయస్థానపు ఉన్నత పీఠంపైకి.. తలారి బాలయ్య స్ఫూర్తిదాయక ప్రస్థానం!

ఆయన నిబద్ధతకు మెచ్చి అప్పటి రాచకొండ పోలీస్ కమిషనర్ (ప్రస్తుత హైదరాబాద్ సీపీ) మహేష్ భగవత్, అప్పటి సైబరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్‌ల చేతుల మీదుగా పలు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Talari Balaiah | సంకల్పం బలంగా ఉంటే పేదరికం ఎప్పటికీ అడ్డుకాదని, కృషి, పట్టుదల తోడైతే కటిక చీకటిని చీల్చుకుంటూ వెలుగు రేఖలా ఎదగవచ్చని నిరూపించారు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్‌పూర్ గ్రామానికి చెందిన సీనియర్ న్యాయవాది తలారి బాలయ్య. ఒకప్పుడు సెలవు రోజుల్లో పొలాల్లో వ్యవసాయ కూలీగా చెమటోడ్చిన ఆ చేతులు.. నేడు న్యాయస్థానంలో తీర్పులు వెలువరించే స్థాయికి చేరాయి.

ఆయన సుదీర్ఘ న్యాయవాద అనుభవాన్ని, నిస్వార్థ సేవలను గుర్తించిన గౌరవ తెలంగాణ Telangana హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక నాంపల్లి కోర్టులో స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌గా నియమిస్తూ అరుదైన గౌరవాన్ని కట్టబెట్టాయి. ఈ శుభవార్తతో తుజాల్‌పూర్ గ్రామంతో పాటు యావత్ కామారెడ్డి జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది.

Talari Balaiah | కూలీ పనులు చేస్తూనే న్యాయశాస్త్ర పట్టా..

తుజాల్‌పూర్ గ్రామానికి చెందిన దివంగత తలారి పోచమ్మ, వెంకయ్య దంపతులకు ఐదవ, చివరి సంతానంగా జన్మించిన బాలయ్య జీవితం పూలబాట కాదు. కేవలం ఎనిమిదేళ్ల లేత వయసులోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబంపై కష్టాల మేఘాలు కమ్ముకున్నాయి.

ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా, చదువు అనే ఆయుధంతోనే జీవితాన్ని గెలవాలని బాలయ్య బలంగా నిశ్చయించుకున్నారు. వేసవి, పండుగ సెలవుల్లో స్వగ్రామానికి వచ్చి వ్యవసాయ కూలీ పనులు చేస్తూ.. ఆ కష్టార్జితంతోనే తన చదువుకు అవసరమైన పుస్తకాలు, ఖర్చులను సమకూర్చుకున్నారు.

తొమ్మిదో తరగతి వరకు సిద్దిపేట ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో, పదో తరగతి (1987–88) బీబీపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో, ఇంటర్మీడియట్ (1989–91) దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ (1991–95) సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. అనంతరం ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టి ఎల్‌.ఎల్‌.బి. (1995–98), లేబర్ లా స్పెషలైజేషన్‌తో ఎల్‌.ఎల్‌.ఎం. (1999–2001) పట్టాలను సాధించి గ్రామీణ విద్యార్థుల సత్తాను చాటారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Untitled 2.jpg 2

Talari Balaiah | 28 ఏళ్లు న్యాయవాదిగా..

1999 ఏప్రిల్ 7న బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవాదిగా నమోదైన తలారి బాలయ్య, గత 28 ఏళ్లుగా సివిల్, క్రిమినల్ కేసుల్లో తన వాదనా పటిమతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాధితులకు అండగా నిలుస్తూ, చట్టపరమైన అంశాలను లోతుగా విశ్లేషిస్తూ సీనియర్ న్యాయవాదిగా ఎదిగారు.

ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం 2018 ఫిబ్రవరి 3న ఎల్‌.బి. నగర్ కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. 2018 నుండి 2022 వరకు ఆ బాధ్యతల్లో ఉన్న ఆయన, అనేక సంచలన క్రిమినల్ కేసుల్లో బలమైన సాక్ష్యాధారాలను కోర్టు ముందుంచి నేరస్థులకు జీవిత ఖైదు వంటి కఠిన శిక్షలు పడేలా కృషి చేశారు. ఆయన నిబద్ధతకు మెచ్చి అప్పటి రాచకొండ పోలీస్ కమిషనర్ (ప్రస్తుత హైదరాబాద్ సీపీ) మహేష్ భగవత్, అప్పటి సైబరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్‌ల చేతుల మీదుగా పలు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

Untitled 1.jpg 1

Talari Balaiah | గ్రామీణ యువతకు ఆదర్శం..

వ్యవసాయ కూలీ స్థాయి నుంచి నేడు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ స్థాయికి ఎదిగిన తలారి బాలయ్య జీవన ప్రస్థానం, పేద మరియు మధ్యతరగతి గ్రామీణ యువతకు ఒక దిక్సూచిలా నిలుస్తోంది. ఆర్థిక స్థోమత లేకపోయినా క్రమశిక్షణ, అంకితభావం ఉంటే ఏ శిఖరాన్నైనా అధిరోహించవచ్చని ఆయన నిరూపించారు.

ఈ సందర్భంగా తనకు ఈ ఉన్నత బాధ్యతను అప్పగించిన తెలంగాణ హైకోర్టుకు, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తలారి బాలయ్య హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రయాణంలో వెన్నంటి నిలిచిన కుటుంబ సభ్యులు, గురువులు, మిత్రులు, న్యాయవాద సహచరులు, పోలీసు అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ.. రాజ్యాంగ విలువలకు కట్టుబడి, నిష్పాక్షికంగా ప్రజలకు న్యాయసేవలు అందిస్తానని స్పష్టం చేశారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *