అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Caught by ACB | మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. ఇంటి మ్యుటేషన్ కోసం లంచం తీసుకుంటుండగా.. అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
కుత్బుల్లాపూర్‌లోని ఎల్లంపేట మున్సిపల్ (Yellampet Municipal) కార్యాలయంలో వార్డు అధికారిగా డి రవీందర్ రెడ్డి పని చేస్తున్నాడు. ఓ వ్యక్తి తన పూర్వికుల ఇంటిని అతడి తండ్రి పేరు మీద నుంచి తన పేరుపై మార్చాలని వార్డు ఆఫీసర్‌ను కలిశాడు. ఈ మేరకు పత్రాలు సమర్పించాడు. అయితే రూ.40 వేలు ఇస్తేనే మ్యుటేషన్ చేస్తానని వార్డు ఆఫీసర్ రవీందర్ రెడ్డి చెప్పాడు. అనంతరం బతిమిలాడటంతో ఆ మొత్తాన్ని రూ.30 వేలకు తగ్గించాడు. ఈ విషయమై బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం ఫిర్యాదుదారుడి నుంచి రూ.30 వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు వార్డు ఆఫీసర్ రవీందర్‌రెడ్డిని రెడ్ హ్యాండెడ్గ పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు.
Caught by ACB | చర్యలు లేకపోవడంతో..
ఇటీవల ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ప్రజల్లో సైతం అవగాహన రావడంతో లంచాలు అడిగిన వారిపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో నిత్యం ఏదో ఒక చోట అధికారులు లంచాలు తీసుకుంటూ దొరుకుతున్నారు. అయినా మిగతా అవినీతి అధికారులు భయపడటం లేదు. లంచాలు తీసుకోవడం ఆపడం లేదు. ఏసీబీకి చిక్కుతున్నా.. తర్వాత కఠిన చర్యలు తీసుకోకపోవడంతో అవినీతి అధికారులు భయపడటం లేదు. కొంతకాలం సస్పెన్షన్ తర్వాత తిరిగి విధుల్లోకి వస్తామనే ధీమాతో వారు రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే భవిష్యత్‌లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
దీనిని కూడా చదవండి : Stock Market Rally | గ్లోబల్ మార్కెట్లలో సెల్లాఫ్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు