అక్షరటుడే, వెబ్‌డెస్క్: Medak job fraud | వయసు కేవలం 20 ఏళ్లు.. కానీ వేసిన స్కెచ్ మాత్రం ఘరానా మోసగాళ్లను సైతం తలదన్నేలా ఉంది. తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్నానని, ఉన్నతాధికారులతో తనకు నేరుగా పరిచయాలు ఉన్నాయని నమ్మబలికి ఇద్దరు వ్యక్తుల నుంచి ఏకంగా రూ.20.70 లక్షలు కొల్లగొట్టిన ఓ యువకుడి గుట్టును మెదక్ టౌన్ పోలీసులు రట్టు చేశారు.
మెదక్ పట్టణానికి చెందిన అలకంటి యశ్వంత్ (20) ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ (సీఐ) డి. మహేష్ శుక్రవారం వెల్లడించారు.
Medak job fraud | రూ.3 కోట్ల బిల్లుల క్లియరెన్స్ పేరుతో రూ.10 లక్షలకు టోకరా
మెదక్ పట్టణంలోని ఆటోనగర్‌కు చెందిన మ్యాడమ్ శివరాములు ఆర్అండ్బీ (R&B) శాఖలో ప్రభుత్వ కాంట్రాక్టు పనులు నిర్వహిస్తుంటారు. ఆయనకు సుమారు రూ.3 కోట్ల విలువైన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్న విషయం తెలుసుకున్న యశ్వంత్, పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగాడు. తాను సచివాలయ ఉద్యోగినని, ఉన్నతాధికారుల ద్వారా పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయిస్తానని శివరాములుకు ఆశచూపాడు. ఇందుకు 10 శాతం కమీషన్ ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అతడి మాటలను పూర్తిగా విశ్వసించిన కాంట్రాక్టర్ శివరాములు, గతేడాది అక్టోబరు 14న యశ్వంత్ తండ్రి అలకంటి మహేష్ పేరిట ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఖాతాకు రూ.10 లక్షలు బదిలీ చేశారు. నెలలు గడుస్తున్నా బిల్లులు మంజూరు కాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. యశ్వంత్ స్పందించకుండా తప్పించుకు తిరగడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.
Medak job fraud | నకిలీ నియామక పత్రంతో మోసం
మరో ఘటనలో నర్సాపూర్‌కు చెందిన మెయ్యడి దశరథ్కు ఆర్టీసీ బస్సు ప్రయాణంలో యశ్వంత్ పరిచయమయ్యాడు. మాటల మధ్యలో తాను సచివాలయంలో పనిచేస్తున్నానని నమ్మించిన యశ్వంత్, విద్యుత్ శాఖలో (TGSPDCL) ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ప్రభుత్వ కొలువు వస్తుందన్న ఆశతో దశరథ్ విడతలవారీగా మొత్తం రూ.10.70 లక్షలు యశ్వంత్ చేతిలో పెట్టాడు. రోజులు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో దశరథ్ నిలదీయగా, ఏకంగా ఒక నకిలీ ఉద్యోగ నియామక పత్రాన్ని (Fake Appointment Order) సృష్టించి పంపించి మరీ బురిడీ కొట్టించాడు.
Medak job fraud | తండ్రితో కలిసి సొంత అవసరాలకు సొమ్ము వాడకం
ఇద్దరు బాధితుల నుంచి వసూలు చేసిన రూ.20.70 లక్షలను యశ్వంత్ తన తండ్రి మహేష్‌తో కలిసి వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 06/2026, బీఎన్ఎస్ (BNS) సెక్షన్ 318(4) కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితుడి వద్ద నుంచి ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) మొబైల్ ఫోన్‌ను పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు.
Medak job fraud | దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు: సీఐ డి. మహేష్
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని, పెండింగ్ బిల్లులు త్వరగా మంజూరు చేయిస్తామని చెప్పే దళారుల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మెదక్ టౌన్ సీఐ డి. మహేష్ హెచ్చరించారు. ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయంటూ మాయమాటలు చెప్పే వారికి ముందస్తుగా డబ్బులు చెల్లించి నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వ నియామకాలు, బిల్లుల చెల్లింపులు పూర్తిగా అధికారిక విధానాల ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు గురైతే తక్షణమే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..