అక్షర టుడే, నందిపేట్: Wild Boar Hunting | అడవి పందిని వేటాడి చంపి, దాని మాంసాన్ని విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి అడవి పంది మాంసంతో పాటు వేటకు ఉపయోగించినట్లు గుర్తించిన టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నందిపేట్ మండల పరిధిలోని డొంకేశ్వర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది.
Wild Boar Hunting | డొంకేశ్వర్ గ్రామ శివారులో
సిద్దిపేట సెక్షన్ పరిధిలోని డొంకేశ్వర్ గ్రామ శివారులో వన్యప్రాణిని చంపి, దాని మాంసాన్ని విక్రయిస్తున్నట్లు అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో వెంటనే స్పందించిన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుధాకర్, నందిపేట్ బీట్ ఆఫీసర్ లింబాద్రి పెట్రోలింగ్ నిర్వహిస్తూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ విక్రయానికి సిద్ధంగా ఉంచిన మాంసాన్ని పరిశీలించగా అది అడవి పందిదిగా గుర్తించారు.
అనంతరం నందిపేట్ అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్‌ను సంప్రదించగా, ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిర్వహించి అది అడవి పందిగా నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి అడవి పంది మాంసంతో పాటు వేటకు ఉపయోగించినట్లు భావిస్తున్న టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్ వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రేంజ్ కార్యాలయానికి తరలించారు.
Wild Boar Hunting | నిందితులు నిర్మల్ జిల్లా వాసులు…
విచారణలో నిందితులు నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అడవి పందిని తామే వేటాడి చంపినట్లు వారు అంగీకరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. వారిని మరుసటి రోజు న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు తెలిపారు. వన్యప్రాణుల వేట, అక్రమ రవాణా, మాంసం విక్రయాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..