BRS Kamareddy | కామారెడ్డిపై ‘గులాబీ’ గురి..! పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు..

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : BRS Kamareddy | రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటోంది. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రజల్లోకి వెళ్లేలా జిల్లాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తుండగా కామారెడ్డి (Kamareddy)లో సభ ఎప్పుడో అన్న చర్చ సాగుతోంది.

BRS Kamareddy | బీఆర్​ఎస్​ పరిస్థితిపై జోరుగా చర్చ..

జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితిపై మళ్లీ జోరుగా చర్చ మొదలైంది. కేసీఆర్ ఓటమి తర్వాత ఇప్పటివరకు జిల్లాకేంద్రంలో ఒక్క సభ కూడా ఏర్పాటు చేయలేదు. అయినా పార్టీ మళ్లీ ఫోకస్ పెడుతుందా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో ఇప్పటివరకు పార్టీని భుజాలపై ఎత్తుకుని దిశానిర్దేశం చేసే నాయకులు లేకుండా పోయారు. అయినప్పటికీ సమన్వయంతో నాయకులు, క్యాడర్ ముందుకు సాగుతోంది. కిందిస్థాయి క్యాడర్ బలంగా ఉండటంతో పార్టీకి ప్లస్ పాయింట్ గా చెప్పుకుంటున్నారు. దాంతో పార్టీకి తిరిగి పునర్వైభవం రాబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ ప్రచారం నేపథ్యంలో ఇక్కడ సభ పెడితే పార్టీ పునాదులు మరింత పటిష్టంగా మారుతాయన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.

BRS Kamareddy | జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో..

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ను బలోపేతం చేసే దిశగా అంతర్గతంగా కసరత్తు జరుగుతోంది. నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశాలు, క్యాడర్​తో సమీక్షలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, రైతుల సమస్యలు, హామీల అమలులో జాప్యం, స్థానిక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి, మళ్లీ పట్టు సాధించాలని పార్టీ వ్యూహం రచిస్తోంది. అయితే జిల్లా కేంద్రంలో ఇప్పటివరకు ఒక్కపెద్ద సభ కూడా పెట్టకపోవడం క్యాడర్​లో నిరాశ కలిగిస్తోందనే చర్చ కూడా ఉంది. సభ పెడితేనే పార్టీ ఇంకా బతికే ఉందనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుందని కార్యకర్తలు అంటున్నారు.

BRS Kamareddy | కేసీఆర్ మళ్లీ పోటీ చేస్తారన్న ప్రచారం

కామారెడ్డిలో కేసీఆర్ మళ్లీ పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కామారెడ్డితో కేసీఆర్ కు ఉన్న అనుబంధం, ఇక్కడి ప్రజల్లో ఉన్న ఆదరణను గుర్తుచేస్తూ ఈ ప్రచారం నడుస్తోంది. కేసీఆర్ మళ్లీ వస్తే జిల్లా రాజకీయ ముఖచిత్రమే మారిపోతుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్ వస్తే ఇతర నియోజకవర్గాల్లో కూడా ప్రభావం పడుతుందని, జిల్లావ్యాప్తంగా పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆశిస్తున్నారు. అయితే అధిష్టానం నుంచి ఇంతవరకు అధికారికంగా ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ఈ ప్రచారం కేవలం క్యాడర్ ఆశగానే మిగిలిపోయిందా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది.

BRS Kamareddy | చాప కింద నీరులా నేతల ప్రయత్నాలు

మరోవైపు కేసీఆర్ పేరు ప్రచారంలో ఉండగానే, చాపకింద నీరులా మరికొందరు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. టికెట్ ఆశిస్తున్న నేతలు సొంతంగా క్యాడర్​ను కలుపుకుంటూ, గ్రామాల్లో పర్యటనలు చేస్తూ, సేవా కార్యక్రమాల పేరుతో ప్రజల్లో ఉంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, దుఃఖ కార్యక్రమాలకు హాజరవుతూ, స్థానిక సమస్యలపై స్పందిస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. అధిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూస్తూనే, తమ బలాన్ని చాటుకునే ప్రయత్నంలో ఉన్నారు. కేసీఆర్ రాకపోతే తమకే అవకాశం వస్తుందనే లెక్కతో వారు ముందుకు సాగుతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

BRS Kamareddy | బలంగా కిందిస్థాయి క్యాడర్

కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్​కు కు కిందిస్థాయి క్యాడర్ ఇప్పటికీ బలంగానే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రామ స్థాయిలో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్యకర్తలు పార్టీతోనే టచ్ లో ఉన్నారు. అధికారం పోయినా క్యాడర్ పార్టీని వీడలేదని, ఇదే పార్టీకి ప్రధాన బలమని నేతలు భావిస్తున్నారు. ఈ క్యాడర్ ను సరిగ్గా వినియోగించుకుంటే ఏ ఎన్నికల్లోనైనా సత్తా చాటవచ్చని అంటున్నారు. ఉద్యమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఉద్యమం నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇవ్వకపోతే క్యాడర్ నిరుత్సాహపడుతుందని ఒక వర్గం అంటోంది. మరోవైపు గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, గెలిచే సత్తా ఉన్నవారికే టికెట్ ఇవ్వాలని మరో వర్గం వాదిస్తోంది.

BRS Kamareddy | పార్టీ వీడిన వారి చేరికలపై సస్పెన్స్

రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత పార్టీ వీడి వెళ్లిన వారి చేరికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. గత ఎన్నికల ముందు, తర్వాత ఇతర పార్టీల్లోకి వెళ్లిన కొందరు నేతలు తిరిగి బీఆర్ఎస్​లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జోరుగా ఉంది. వారిని చేర్చుకుంటే బలం పెరుగుతుందా, నమ్మకమైన క్యాడర్ కు అన్యాయం జరుగుతుందా అనే దానిపై నేతలు తర్జనభర్జన పడుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో మాత్రం పార్టీ నుంచి వెళ్లిన వారిని తిరిగి చేర్చుకోవద్దన్న డిమాండ్ ఉద్యమ కారుల నుంచి బలంగా వినిపిస్తోంది. తిరిగి వచ్చే వారికి పదవులు ఇస్తే పాతవారు అలిగే ప్రమాదం ఉందని, చేర్చుకోకపోతే బలమైన నేతలు దూరమవుతారని చర్చ జరుగుతోంది.

BRS Kamareddy | కేటీఆర్ వరుస పర్యటనల నేపథ్యంలో..

కేటీఆర్ వరుస పర్యటనల నేపథ్యంలో కామారెడ్డిలో చర్చ మరింత వేడెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ పర్యటనలు క్యాడర్​లో ఉత్సాహం నింపుతున్నాయి. కామారెడ్డి జిల్లాకు కూడా కేటీఆర్ వస్తే పార్టీకి మరింత ఊపు వస్తుందని నేతలు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటించగా ఒక్క కామారెడ్డి నియోజకవర్గంలో మాత్రమే పర్యటించలేదు. కామారెడ్డిలో కేటీఆర్ సభపెడితే పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, నిద్రాణంగా ఉన్న క్యాడర్ మళ్లీ యాక్టివ్ అవుతుందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Yellareddy Development | ఎల్లారెడ్డి అభివృద్ధికి ప్రత్యేక నిధులు, అనుమతులివ్వండి..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *