అక్షరటుడే, వెబ్‌డెస్క్: UAE Bus Accident | గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ UAE)లో మరోసారి రహదారి రక్తసిక్తమైంది. రాస్ అల్ ఖైమా ఎమిరేట్‌లో మంగళవారం (నవంబర్ 24, 2026) తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో భారతీయ పౌరులు కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
UAE Bus Accident | ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో..
యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాస్ అల్ ఖైమాలోని ‘అల్ వతన్’ (Al Watan) రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
సాంకేతిక (మెకానికల్) లోపం తలెత్తడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ భారీ ట్రక్కును, 41 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఘటనా స్థలంలోనే 11 మంది ప్రయాణికులు మృతి చెందగా, క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 13కు చేరినట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. గాయపడిన మరో 14 మందికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
UAE Bus Accident | హెల్ప్‌లైన్ ఏర్పాటు
ఈ ఘోర ప్రమాదంపై దుబాయ్‌లోని భారత కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేసింది. మృతుల్లో ఎంతమంది భారతీయులు ఉన్నారనే పూర్తి వివరాలను స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ సేకరిస్తున్నట్లు తెలిపింది.
బాధిత కుటుంబాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చింది. సమాచారం కోసం 800-46342 హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది.
UAE Bus Accident | కొద్ది రోజుల వ్యవధిలోనే రెండో పెను విషాదం
యూఏఈలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రవాస భారతీయులను కలవరపెడుతున్నాయి. ఇటీవలే నవంబర్ 13న ఫుజైరా ఎమిరేట్‌లో జరిగిన మరో ఘోర ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, అందులో నలుగురు భారతీయులు ఉన్న విషయం తెలిసిందే. ఆ విషాదం మరవకముందే ఇప్పుడు రాస్ అల్ ఖైమాలో మరో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..