అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Road Safety | రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, వానాకాలం 2026-27 ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
Kamareddy Road Safety | జిల్లాకు రూ.కోటి నిధులు..
ఈ సమావేశాల్లో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా సమీక్షలో జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, భద్రతా చర్యల అమలుపై సమగ్రంగా చర్చించారు. రోడ్డు భద్రత కోసం ప్రతి జిల్లాకు రూ.1 కోటి నిధులు కేటాయించిన నేపథ్యంలో, ఆ నిధులను ప్రాధాన్యతా కార్యక్రమాలకు వినియోగించాలని కలెక్టర్ (Collector Ashish Sangwan) సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి భద్రతా చర్యలు చేపట్టాలని, శాఖలు సమన్వయంతో కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రయాణికుల భద్రతలో నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. వీధి కుక్కల వల్ల ప్రమాదాలు జరగకుండా పశుసంవర్ధక శాఖ అధికారులు ఎస్ఓపీలు రూపొందించి సమర్పించాలని, మున్సిపాలిటీల పరిధిలో, రహదారుల వెంట అనుమతులు లేకుండా నడుస్తున్న అక్రమ దాబాలను గుర్తించి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Kamareddy Road Safety | ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లను సకాలంలో పూర్తి చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయింపు పొందిన బియ్యం మిల్లులకు లేదా గోదాములకు మాత్రమే రవాణా చేయాలని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని సూచించారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్అండ్బీ ఈఈ అంజయ్య, పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్, జిల్లా సహకార మార్కెటింగ్ శాఖ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దామోదరరెడ్డి, జిల్లా సహకార అధికారి రామ్మోహన్, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Koti Deepotsavam | రేపు కామారెడ్డిలో కోటి దీపోత్సవం