అక్షరటుడే, డిచ్పల్లి: Nizamabad Rural Police | నిజామాబాద్ (Nizamabad) రూరల్ నియోజకవర్గ పరిధిలో పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు పోలీస్ సేవలను మరింత చేరువ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి అన్నారు. జిల్లాకు విచ్చేసిన డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
Nizamabad Rural Police | పోలీస్స్టేషన్లకు నూతన భవనాలు..
అనంతరం నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ల పరిధుల పునర్వ్యవస్థీకరణ, పోలీస్ స్టేషన్లకు నూతన భవనాలు, పోలీస్ బెటాలియన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. నిజామాబాద్ రూరల్, మోపాల్ పోలీస్ స్టేషన్ల పరిధులను ప్రజల సౌలభ్యం, పరిపాలనా అవసరాలు, శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని పునర్వ్యవస్థీకరించాలని ఎమ్మెల్యే డీజీపీని కోరారు. ఇందులో భాగంగా ప్రస్తుతం నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జలాల్పూర్, మల్కాపూర్ (ఏ), పాల్దా గ్రామాలతో పాటు నిజామాబాద్ నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రినగర్, సారంగాపూర్ ప్రాంతాలను నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకురావాలని, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పాంగ్రా, మాధవ్‌నగర్ గ్రామాలతో పాటు నిజామాబాద్ నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోర్గాం (పి) గ్రామాన్ని మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చాలని కోరారు.
Nizamabad Rural Police | ఈ మార్పులతో సేవలు మరింత చేరువలో..
ఈ మార్పుల ద్వారా ఆయా గ్రామాల ప్రజలకు పోలీస్ సేవలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు పోలీస్ పరిపాలన, శాంతిభద్రతల పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా సాగుతుందని ఎమ్మెల్యే వివరించారు. ఇందల్వాయి పోలీస్‌స్టేషన్ ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతోందని, పోలీస్ సిబ్బందికి మెరుగైన వసతులు కల్పించడంతో పాటు ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు సొంత భవనం అవసరమని పేర్కొన్నారు. డిచ్‌పల్లిలో 1975లో బెటాలియన్ ఏర్పాటైన నాటి నుంచి నిర్మించిన పలు భవనాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయని, ముఖ్యంగా పరిపాలనా భవనం, స్టాఫ్ క్వార్టర్స్ పాతబడిపోవడంతో పోలీస్ సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో బెటాలియన్‌లో నూతన నిర్మాణాలు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Road Safety | రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి