అక్షరటుడే, కామారెడ్డి : Young India School | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోంది. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య అందించడం కోసం వీటిని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.
ఇవి ఏర్పాటు అయితే విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది. జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండగా.. మూడు పాఠశాలలు మంజూరు అయ్యాయి. కామారెడ్డికి మాత్రం పాఠశాలను మంజూరు చేయలేదు. దీంతో నియోజకవర్గంలో యంగ్ ఇండియా బడి ఏర్పాటు చేస్తారా లేదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
కామారెడ్డి జిల్లా (Kamareddy District)లో మొత్తం నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. కామారెడ్డి మినహాయించి మిగతా మూడు నియోజకవర్గాలకు ప్రభుత్వం యంగ్ ఇండియా పాఠశాలలను మంజూరు చేసింది. పనులు కూడా మొదలయ్యాయి. వచ్చే విద్యాసంవత్సరానికి ప్రవేశాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే కామారెడ్డిపై మాత్రం ప్రభుత్వం శీతకన్ను వేసిందన్న ప్రచారం సాగుతోంది. ప్రతి స్కూల్ 25 ఎకరాల్లో, 4 నుంచి 12వ తరగతి వరకు 2,560 మందితో ఉంటుంది. ఇందులో ఏఐ క్లాసులు, స్టెమ్ ల్యాబ్‌లు, క్రీడలు, హాస్టల్, ఆరోగ్య కేంద్రాలు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 105 స్కూళ్లకు రూ.21 వేల కోట్లు కేటాయించారు. ఇప్పటికే 79 స్కూళ్లకు అనుమతి, 44 చోట్ల పనులు కూడా మొదలయ్యాయి.
Young India School | ఎమ్మెల్యేల పర్యవేక్షణ
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. తాజా జాబితా ప్రకారం జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు స్కూళ్లు మంజూరయ్యాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లింగంపేట మండలం మోతె గ్రామం, బాన్సువాడ నియోజకవర్గంలో పోతంగల్ మండలం రాంగంగానగర్, జుక్కల్ నియోజకవర్గంలో మద్నూర్ మండలంలో పాఠశాలల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పనులు త్వరగా పూర్తి చేసి వచ్చే విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యేలా ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
Young India School | వచ్చే ఏడాది నుంచి తరగతులు
మంజూరైన మూడు చోట్ల భూమి గుర్తింపు, సరిహద్దుల నిర్ణయం పూర్తయ్యాయి. కొన్ని చోట్ల ప్రహరీ పనులు కూడా మొదలయ్యాయి. అధికారుల లెక్కల ప్రకారం నిర్మాణాలు వేగంగా సాగితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి ప్రవేశాలు చేపట్టే అవకాశం కూడా ఉంది. ఒక్కో స్కూల్‌లో సుమారు 2000 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
Young India School | కామారెడ్డికి ఇస్తారా
జిల్లా కేంద్రమైన కామారెడ్డికి మాత్రం యంగ్ ఇండియా స్కూల్ మంజూరు కాలేదు. తొలుత కామారెడ్డిలో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినా, మంజూరు జాబితాలో మాత్రం కామారెడ్డి పేరు లేకపోవడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా కేంద్రానికి ఎందుకు అన్యాయం అంటూ పలు విద్యార్థి, యువజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పూలే జయంతి రోజున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొని, వారం రోజుల్లో కామారెడ్డికి యంగ్ ఇండియా పాఠశాల మంజూరు అవుతుందని ప్రకటించారు. అయితే ఆ హామీ ఇచ్చి నెలలు దాటినా ఇప్పటికీ ఎలాంటి అతిగతి లేదు.
Young India School | కామారెడ్డికి మంజూరు చేయాలి
– వినయ్ కుమార్, విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు
జిల్లా కేంద్రంలో విద్యాసంస్థల ఏర్పాటుకు అనువైన స్థలం ఉంది. ఇప్పటికే జిల్లా కేంద్రానికి రావాల్సిన ఏటీసీ సెంటర్ను ఎలాంటి రవాణా సౌకర్యం లేని ప్రాంతంలో మంజూరు ఇచ్చారు. యంగ్ ఇండియా పాఠశాల కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసేలా ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు ప్రత్యేక చొరవ తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..: PDS Rice Seized | అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం సీజ్