Telangana Cabinet Decisions | భూముల ధరల పెంపు.. ఈ నెలాఖరు నుంచే అమలు!

Naresh Chandan
Telangana Cabinet Decisions

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Cabinet Decisions | విద్యుత్ కొనుగోలుతోపాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టులలో జరిగిన అక్రమాలపై విచారణకు సంబంధించిన కమిషన్ నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కు అప్పగించేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

విద్యుత్తు కొనుగోళ్లతో పాటు యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు ప్లాంట్లలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై రాష్ట్ర సర్కారు విచారణ కమిషన్​ను ఏర్పాటు చేసింది. కమిషన్స్ ఆఫ్ ఇన్క్వైరీ చట్టం ప్రకారం మార్చి 14, 2024న రిటైర్డ్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో 2024 జులైలో ఆయన విచారణ నుంచి తప్పుకొన్నారు. దీంతో జస్టిస్ మదన్ బి. లోకూర్‌ను కమిషన్‌గా నియమించారు.

Telangana Cabinet Decisions | 114 పేజీల నివేదిక

2024 అక్టోబర్​లో మొత్తం 114 పేజీల నివేదికను ప్రభుత్వానికి కమిషన్ సమర్పించింది. అనంతరం జనవరి 4, 2025 న జరిగిన కేబినేట్ సమావేశంలో సదరు నివేదికపై తదుపరి చర్యలపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించింది. నివేదికను పరిశీలించిన అడ్వకేట్ జనరల్ పలు సూచనలు, అభిప్రాయాలను తెలియజేశారు.

ఈ మేరకు ఆ అంశాలపై ఈ రోజు (సోమవారం) కేబినేట్ చర్చించింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు,అంతర్రాష్ట్ర అంశాలు ఈ కేసులో ఉన్నాయి. అందుకే నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐకి అప్పగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు మంత్రివర్గం ఆదేశాలు జారీ చేసింది.

ఇక భూముల ధరలను సవరించాలని, హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మార్కెట్ విలువల రేషనలైజేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ శాఖకు కేబినెట్​ అనుమతి ఇచ్చింది. ఈనెల చివరి వారంలో సవరించిన విలువలు అమల్లోకి రానున్నాయి.

వివిధ అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు, రోడ్ల విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించే పరిహారం ధరలపై అసంతృప్తితో ఉన్నారు. ధర పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికితోడు వాస్తవ మార్కెట్ ధరలతో పోలిస్తే ప్రభుత్వం నిర్ణయించిన భూముల ధరల మధ్య భారీగా వ్యత్యాసాలున్నాయి. ఇందుకు శాస్త్రీయ పద్ధతి అనుసరించి ఈ ధరలను సవరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ⁠జిల్లాల్లోని మార్కెట్ విలువల రివిజన్ కమిటీలు విలువలను సవరిస్తుంది. ⁠

Telangana Cabinet Decisions | పది శాతం చెల్లించే వెసులుబాటు

హిల్ట్ పాలసీలో దరఖాస్తు చేసుకునే వారికి ఒక అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. భూముల ధరలు పెరిగేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా పది శాతం చెల్లించే వెసులుబాటు కల్పించేందుకు ఆమోదం తెలిపింది. వారికి ఇప్పుడున్న భూముల ధరలే వర్తింపజేస్తారు. మిగతా 90 శాతం మరో 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.

Telangana Cabinet Decisions | వన్ టైమ్ సెటిల్ మెంట్

తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో 33/11 కేవీ సబ్​ స్టేషన్​ల వద్ద సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. పైలెట్ పద్ధతిన 18 చోట్ల ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. సుమారు రూ.66.50 కోట్లతో 19 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో పెండింగ్ లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాల పన్నులను క్లియర్ చేసేందుకు వన్ టైమ్ సెటిల్ మెంట్ ( OTS) వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

సుమారు రూ. 5864 కోట్ల బకాయిలున్నాయి. కాగా, వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా రూ.1686 కోట్లు వస్తాయని అంచనా వేసింది. హైదరాబాద్ జల మండలి నీటి బకాయిలను సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

పాలిటెక్నిక్​, ఐటీఐలు (అడ్వాన్సుడ్ ట్రైనింగ్ సెంటర్లు), టీ శాట్ ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకు రావాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్​లో ఆధునిక కూరగాయల మార్కెట్ కోసం 42 ఎకరాలు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Telangana ICC Committee | రెవెన్యూ శాఖలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) ఏర్పాటు 

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *