Vijay Oath Taking | రేపే విజ‌య్ ప్ర‌మాణ స్వీకారం.. మెజారిటీ కోసం క‌స‌ర‌త్తు, మ‌ద్ధ‌తుపై కొన‌సాగుతున్న స‌స్పెన్స్

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vijay Oath Taking | తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకునే స‌మ‌యం ఆసన్నమైంది. సినీ నటుడు, విజయ్  నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) పార్టీ అద్భుత ప్రదర్శనతో అధికారం ద‌క్కించుకునేందుకు స‌న్న‌ద్ధ‌మవుతుంది. విజయ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

ఈ నెల 7న చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విజయ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై, ఏకగ్రీవంగా శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కి లేఖ రాశారు.

Vijay Oath Taking | మెజారిటీ స‌భ్యుల మ‌ద్ధ‌తు..

234 సభ్యుల అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు అవసరం. ప్రస్తుతం టీవీకేకు 108 సీట్లు ఉండటంతో, మెజారిటీకి ఇంకా సభ్యుల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుంచి 5 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ, పూర్తి మెజారిటీకి ఇంకా కొంత సంఖ్యాబలం అవసరం కావడం వల్ల విజయ్ ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా, ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన ఎం.కె. స్టాలిన్ (M.K. Stalin) ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తాత్కాలికంగా బాధ్యతలు కొనసాగించాలని గవర్నర్ కోరారు.

విజయం అనంతరం విజయ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, ప్రజల శ్రేయస్సే తమ లక్ష్యమని పేర్కొన్నారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోదీ (Narendra Modi), రాహుల్ గాంధీలకు (Rahul Gandhi) కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ ఫలితాలపై అంతర్జాతీయ స్థాయిలో కూడా స్పందనలు రావడం గమనార్హం. డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోదీకి అభినందనలు తెలపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Vijay Oath Taking | విజయ్ ముందున్న రాజకీయ మార్గాలు

ప్రస్తుతం మెజారిటీ కోసం విజయ్ ముందున్న మార్గాలు ఆసక్తికరంగా మారాయి:

చిన్న పార్టీల మద్దతు:
కాంగ్రెస్‌తో పాటు ఐయూఎంఎల్, సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి చిన్న పార్టీల మద్దతు కోరే అవకాశం ఉంది. అయితే ఈ పార్టీలు డీఎంకే కూటమిలో ఉండటం వల్ల వారి నిర్ణయం కీలకంగా మారింది.

అన్నాడీఎంకే కూటమి వైపు చూపు:
మరోవైపు అన్నాడీఎంకే కూటమిలో ఉన్న పీఎంకే, ఏఎంఎంకే వంటి పార్టీల మద్దతు కూడా పరిశీలనలో ఉంది. ఒకవేళ అన్నాడీఎంకే ప్రత్యక్ష మద్దతు ఇస్తే విజయ్ ప్రభుత్వం సుస్థిరంగా నిలిచే అవకాశం ఉంది.

అయితే అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలు కూడా ఈ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముంది. కొందరు ఎమ్మెల్యేలు MLA బయటకు వచ్చి విజయ్‌కు మద్దతు ఇవ్వొచ్చన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో జరగనున్న ఎమ్మెల్యేల సమావేశం కీలకంగా మారింది.

Vijay Oath Taking | 15 రోజుల్లో బలం నిరూపణ

ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అసెంబ్లీలో 15 రోజుల్లో మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో విజయ్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఒకవైపు విజయోత్సాహం, మరోవైపు రాజకీయ చర్చలతో ఉత్కంఠ నెలకొంది. విజయ్ ఎవరితో చేతులు కలుపుతారు? ఎలా మెజారిటీ సాధిస్తారు? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. త్వరలోనే ఈ స‌స్పెన్స్‌కి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి..: Bengal Political Crisis|మే 9న కొత్త సర్కార్.. మమత పట్టుదలకు ఈసీ నోటిఫికేషన్‌తో బ్రేక్!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *