Vijay Thalapathy | దళపతి @ జననేత.. తమిళనాడు రాజకీయాల్లో ‘విజయ్’ శకం మొదలు!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Thalapathy | “వెండితెరపై ఆయన నడిస్తే థియేటర్లు దద్దరిల్లుతాయి.. డైలాగ్ చెబితే బాక్సాఫీస్ బద్దలవుతుంది.. కోట్లాది మంది అభిమానులకు కేవలం ఒక నటుడు కాదు, గుండెల్లో కొలువైన ‘దళపతి’.

కాగా ఇప్పుడు, ఆ వెండితెర రారాజు తన విలాసవంతమైన కెరీర్‌ను, కోట్లాది రూపాయల పారితోషికాన్ని పక్కనెట్టి.. సామాన్యుడి కోసం సమరశంఖం పూరించారు.

తమిళనాడు రాజకీయాల్లో సినిమాకి, సింహాసనానికి ఎప్పటి నుంచో విడదీయలేని బంధం ఉంది. ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజ నటుల వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ.. ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పతాకాన్ని చేతబూని, ముఖ్యమంత్రి పీఠం వైపు విజయ్ వేస్తున్న అడుగులు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రభంజనం మోగిస్తున్నాయి.

విజయ్​ వెనుక ఉన్నది కేవలం అభిమాన గణమేనా..? లేక ఒక పక్కా రాజకీయ వ్యూహమా..?  1.5 కోట్ల సభ్యత్వాలతో, మొదటి  ఎన్నికల్లోనే 108 అసెంబ్లీ స్థానాలతో అధికార పగ్గాలు చేజిక్కించుకుంటున్న ‘విజయ్’ ప్రభంజనం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటి? చిన్ననాటి విషాదం నుంచి శిఖరాగ్ర స్థాయికి ఎదిగిన సినీ ప్రస్థానం, సేవా కార్యక్రమాల నుంచి రాజకీయ ప్రకంపనల వరకు.. దళపతి విజయ్ సమగ్ర రాజకీయ విశ్లేషణ మీకోసం!”

Vijay Thalapathy

Vijay Thalapathy | కళల కుటుంబం నుంచి..

విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. మద్రాసు (ప్రస్తుత చెన్నై)లో జూన్ 22, 1974న జన్మించారు. విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ ప్రముఖ సినిమా దర్శకుడు. తల్లి శోభా చంద్రశేఖర్ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, నేపథ్య గాయని. విజయ్ చిన్నతనం నుంచే ఇంట్లో సినీ వాతావరణం ఉండేది. అయితే, తన జీవితంలో ఒక విషాదం ఉంది. చెల్లెలు విద్య అకాల మరణం విజయ్‌ని తీవ్రంగా కలచివేసింది. ఒంటరిని చేసింది. ఆ ఘటనతో ఆయన నిశ్శబ్దంగా, గంభీరంగా మారారని విజయ్​ తల్లిదండ్రులు చెబుతుంటారు.

Vijay Thalapathy

Vijay Thalapathy | వెండి తెరకు పనికిరాడని..

తన తండ్రి దర్శకత్వంలో విజయ్ బాలనటుడిగా కెరీర్ ప్రారంభించారు. హీరోగా 1992లో ‘నాలయ తీర్పు’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. కెరీర్​ ప్రారంభంలో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తన రూపం గురించి, నటన గురించి తీవ్రమైన హేళనలు ఎదుర్కొన్నారు. కానీ, వెనుకడుగు వేయలేదు.

మలుపు తిప్పిన చిత్రాలు: ‘పూవే ఉనక్కాగా’ సినిమా ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్‌ నుంచి గుర్తింపు తెచ్చింది.

మాస్ ఇమేజ్: ‘కాదలుక్కు మరియాదై’, ‘ఖుషి’ వంటి లవ్ స్టోరీల తర్వాత ‘పోకిరి’, ‘గిల్లి’ వంటి చిత్రాలతో విజయ్ తిరుగులేని మాస్ హీరోగా ఎదిగారు.

బాక్సాఫీస్ కింగ్: రజనీకాంత్ తర్వాత నేడు తమిళనాట అత్యధిక మార్కెట్ ఉన్న నటుడిగా, రూ. వందల కోట్ల వసూళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా విజయ్​ నిలిచారు.

విజయ్​ నటించిన మొత్తం సినిమాలు 69. ‘దళపతి 69’ (ప్రస్తుతం ‘జన నాయగన్’ అనే పేరుతో ప్రచారంలో ఉంది) ఆఖరి చిత్రంగా భావిస్తున్నారు. ‘లియో’ (2023) చిత్రం విజయ్​ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

Vijay Thalapathy

Vijay Thalapathy | వ్యక్తిగత జీవితం

1999లో సంగీత సోలింగరాజన్‌ను విజయ్ వివాహం చేసుకున్నారు. ఆమె విజయ్‌కి వీరాభిమాని. వీరికి సంజయ్ అనే కుమారుడు, కుమార్తె దివ్య సాష ఉన్నారు. కాగా, ప్రముఖ నటి త్రిషతో సహజీవనంలో ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరిగింది.

Vijay Thalapathy | ‘విజయ్ మక్కల్ ఇయక్కం’

విజయ్ రాజకీయాల్లోకి రాకముందే తన అభిమాన సంఘాలను ఏకం చేసి ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ (VMI) అనే సేవా సంస్థగా మార్చారు. ఈ సంస్థ ద్వారా పేద విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం, ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు (తుపాను, కరోనా సమయం) బాధితులకు అండగా నిలవడం చేసేవారు.

దీనికితోడు పదో తరగతి, ఇంటర్మీడియట్ టాపర్లను స్వయంగా పిలిచి సన్మానించి, ఆర్థిక సాయం చేయడం ద్వారా విద్యార్థుల హృదయాలను గెలుచుకున్నారు.

Vijay Thalapathy

Vijay Thalapathy | రాజకీయ ప్రవేశం

చాలా కాలంగా విజయ్ రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం సాగింది. చివరకు ఫిబ్రవరి 2వ తేదీ, 2024లో తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ను ప్రకటించారు. ఈ పార్టీ లక్ష్యం అవినీతి రహిత పాలన, సామాజిక సమానత్వంగా పేర్కొన్నారు.

Vijay Thalapathy | స్థానిక సంస్థల విజయం

రాజకీయ పార్టీగా మారకముందే, 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కం (VMI) 169 స్థానాల్లో పోటీ చేసి 115 స్థానాల్లో విజయం సాధించి తమిళ రాజకీయాల్లో అందరినీ ఆకర్షించింది.

“ఎదురుచూడండి.. సమయం వస్తుంది” అనే నినాదంతో అభిమానులను ఉత్తేజపర్చుతూ ముందుకు సాగారు. తాను ఒప్పుకొన్న సినిమాలను పూర్తి చేసి, పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేస్తానని ప్రకటించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతూ వచ్చారు. విజయ్​ ప్రసంగాలకు ఆకర్షితులై 1.5 కోట్ల మంది తమిళులు (సెప్టెంబర్ 2025) పార్టీ సభ్యులుగా చేరారు.

అలా క్షేత్రస్థాయిలో విజయ్ పార్టీ బలమైన ఓటు బ్యాంకును నిర్మించుకుంది. ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసే యువతను తన వైపు తిప్పుకొన్నారు. అభిమానులను ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు.

సింహం సింగిల్​గా వస్తుందంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ పడ్డారు. దశాబ్దాల కాలంగా ఆధిపత్యం కొనసాగిస్తున్న డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలను నేరుగా ఢీకొన్నారు.

అలా తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే 108 స్థానాలను గెలుచుకున్న టీవీకే శాసనసభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది (మొత్తం 234 స్థానాలు). కాగా అందులో విజయ్​ ఒక స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఆ పార్టీ బలం 107కు చేరింది. ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్​ దళపతికి జై కొట్టింది. ఇక సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2 కూడా మద్దతు ఇవ్వడంతో టీవీకే బలం 118కి చేరింది. మ్యాజిక్​ ఫిగర్​ దక్కడంతో విజయ్​ సీఎం (CM Vijay) గా ప్రమాణం చేయడానికి మార్గం సుగమమైంది.

Vijay Thalapathy

విజయ్​ టీవీకే ఎన్నికల మేనిఫెస్టో

విజయ్ తన మేనిఫెస్టోలో మహిళలు, యువత, పేదల సంక్షేమానికి పెద్దపీట వేశారు

పథకం పేరు ముఖ్య ఉద్దేశ్యం

మదిప్పుమిగు మగళిర్ తిట్టం – కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సాయం.

అన్నపూర్ణి సూపర్ సిక్స్ప్రతి – కుటుంబానికి ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితం.

విద్యార్థి ప్రోత్సాహం – ఉన్నత చదువుల కోసం ₹20 లక్షల వరకు గ్యారెంటీ లేని విద్యా రుణాలు.

యువ పారిశ్రామికవేత్తలు – కొత్త స్టార్టప్‌ల కోసం ₹25 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు.

మహిళా రక్షణ – మహిళల రక్షణ కోసం 500 ప్రత్యేక నిఘా బృందాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు.

ఇది కూడా చదవండి..: Vijay Oath Ceremony | రేపే విజయ్​ ప్రమాణ స్వీకారం.. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ అనుమతి

 

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *