అక్షరటుడే, వెబ్‌డెస్క్: Fishermen Compensation AP | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని లక్షలాది మంది మత్స్యకార కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. సముద్రంలో చేపల వేట నిషేధం కొనసాగుతున్న సమయంలో కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం మరోసారి ‘మత్స్యకార భరోసా’ పథకాన్ని అమలు చేయనుంది.
ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ఆధ్వర్యంలో ఈ పథకం కింద భారీ స్థాయిలో నిధులు విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.20,000 చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు రూ.286 కోట్లను విడుదల చేయనుంది. మే 19వ తేదీ నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Fishermen Compensation AP | 61 రోజుల పాటు వేట నిషేధం
గత ప్రభుత్వ కాలంలో ఈ సాయం రూ.10,000 మాత్రమే ఉండగా, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం దానిని రెట్టింపు చేసి రూ.20,000కు పెంచింది. దీంతో మత్స్యకార కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా లభించనుంది. డబ్బులు జమ అయిన తర్వాత లబ్ధిదారులు ఈజీఎస్‌డబ్ల్యూఎస్ పోర్టల్ ద్వారా తమ పేమెంట్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. సముద్ర జీవసంపద పరిరక్షణ, చేపల సంతానోత్పత్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రతి ఏడాది వేసవి కాలంలో వేట నిషేధాన్ని అమలు చేస్తుంది. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మొత్తం 61 రోజుల పాటు సముద్రంలో యాంత్రిక, మోటారు బోట్లతో Motor Boats చేపల వేటను పూర్తిగా నిషేధించారు.
Fishermen Compensation AP | నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా
అయితే చిన్న పడవల ద్వారా తీర ప్రాంతానికి సమీపంలో వేటాడే వారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.30 లక్షల మత్స్యకార కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా, ఈసారి కూడా అర్హులైన వారందరికీ సాయం అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వేట నిషేధ సమయంలో నిబంధనలు అతిక్రమించి సముద్రంలోకి వెళ్లే వారిపై మత్స్యశాఖ కఠినంగా వ్యవహరించనుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా విధించడంతో పాటు, వేట వలలను స్వాధీనం చేసుకోనున్నారు.
అంతేకాకుండా సంబంధిత బోట్ల లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ను ఏడాది పాటు రద్దు చేయనున్నారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారికి మత్స్యకార భరోసా సాయం కూడా నిలిపివేయబడుతుంది. ఇక మత్స్యకారులకు మరింత ఊరటనిచ్చేలా బోట్లకు అందించే డీజిల్ సబ్సిడీని లీటరుకు రూ.9కు పెంచారు. అలాగే వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి..: Eluru Pastor Arrest | మైనర్‌పై చర్చి పాస్టర్ అత్యాచారం.. గర్బం దాల్చిన బాలిక!

