Tamil Nadu Politics | విజయ్ విజయంపై రాజకీయ రగడ.. పవన్ కళ్యాణ్‌పై రోజా ఘాటు వ్యాఖ్యలు

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tamil Nadu Politics | తమిళనాడులో విజ‌య్ పొలిటిక‌ల్ విజ‌యంపై (Vijay politics) సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. విజయ్‌ను, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పోలుస్తూ జరుగుతున్న ట్రోలింగ్‌పై మాజీ మంత్రి రోజా ఘాటుగా (Roja comments) స్పందించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ విధానం, ఎన్నికల వ్యూహం, ప్రభుత్వ బాధ్యతలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Tamil Nadu Politics | తమిళనాడు రాజకీయాల్లో సంచలనం..

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ (TVK Party) ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న వేళ, ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపైనా కనిపిస్తోంది. పార్టీ అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో భారీ చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా విజయ్ రాజకీయ ప్రయాణాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ కెరీర్‌తో పోలుస్తూ నెటిజన్లు విస్తృతంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “మేము మాట్లాడితే తిట్టారని అంటారు. కానీ ఇప్పుడు తమిళనాడులో విజయ్ గెలిచిన తర్వాత అందరూ పవన్ కళ్యాణ్‌ను ఎందుకు విమర్శిస్తున్నారు?” అంటూ ఆమె ప్రశ్నించారు.

Tamil Nadu Politics | ప‌వర్ లెస్ స్టార్..

ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు పవన్‌లో లేవని వ్యాఖ్యానించిన రోజా (Roja) .. పార్టీ స్థాపించిన వ్యక్తి స్వయంగా పోటీ చేయకుండా, ఇతర పార్టీలకు ఓటేయమని ప్రజలను అడగడం ఎక్కడైనా చూశామా? అని ప్రశ్నించారు. విమర్శలు రావడంతో తర్వాత రెండు చోట్ల పోటీ చేశారని, కానీ రెండు స్థానాల్లోనూ ఓడిపోయారని గుర్తు చేశారు. ఒక పవర్ స్టార్ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోతే ఆయనను పవర్ స్టార్ అంటారా? పవర్‌లెస్ స్టార్ అంటారా?” అంటూ రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి తిట్లు కాదని, నిజాలు మాత్రమే చెబుతున్నానని ఆమె పేర్కొన్నారు. ఇక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను కూడా రోజా ప్రస్తావించారు. “రాష్ట్రంలోని అమ్మాయిల భద్రత నుంచి రైతుల సమస్యల వరకు ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రతి జిల్లాకు వెళ్లి అక్కడే పుట్టానని చెప్పి ప్రజలను ఆకట్టుకున్నారు. కానీ గెలిచిన తర్వాత రాష్ట్రంలో ఎంతకాలం ఉన్నారు? ఎన్ని అభివృద్ధి పనులు చేశారు?” అంటూ ప్రశ్నించారు.

 ఎక్కువ సమయం హైదరాబాద్​లోనే..

ప్రభుత్వంలో (Andhra politics) కీలక పదవిలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎక్కువ సమయం హైదరాబాద్‌లో గడుపుతూ షూటింగ్‌లలో పాల్గొంటున్నారని రోజా ఆరోపించారు. ప్రజల పన్నుల డబ్బుతో ప్రత్యేక విమానాలు, భద్రతా సిబ్బంది వినియోగిస్తున్నారని విమర్శించారు. దీనిపై ప్రతిపక్షాలు ఎందుకు ప్రశ్నించడం లేదని కూడా ఆమె ప్రశ్నించారు.అలాగే తన రాజకీయ జీవితాన్ని ప్రస్తావిస్తూ రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కుటుంబాన్ని పోషించేందుకు తాను టీవీ షోలు చేస్తే తీవ్ర విమర్శలు చేశారని గుర్తు చేసుకున్నారు.

కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న నేతలు సినిమాలు, టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు ఎవరూ మాట్లాడటం లేదని విమర్శించారు. రోజా చేస్తే బూతు షో అంటారు.. వాళ్లు చేస్తే మాత్రం బూతు కాదు?” అంటూ ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎక్కువ సమయం కేటాయించి బాధ్యతగా పనిచేయాల్సిందని, కానీ పవన్ మాత్రం షూటింగ్‌లలో బిజీగా ఉన్నారని వ్యాఖ్యానించారు.ఇక తమిళనాడు ఎన్నికల ఫలితాల రోజున సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్‌పై భారీగా ట్రోలింగ్ జరిగిందని రోజా పేర్కొన్నారు. ‘విజయ్‌ని చూసి నేర్చుకోరా? హీరో అంటే ఇలా ఉండాలి.. సింగిల్‌గా రావాలి’ అంటూ పవన్‌ను విమర్శించిన పోస్టులు చూసి తనకు నవ్వొచ్చిందని అన్నారు.

ఇది కూడా చదవండి: CM Vijay | విజయ్​ అను నేను.. ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే అధినేత

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *