CM Vijay | విజయ్​ అను నేను.. ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే అధినేత

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Vijay | తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ (Vijay)​ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు టీవీకే నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రాష్ట్రంలో, ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, తమిళగ వెట్రి కజగం (TVK) అధ్యక్షుడు చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు అసెంబ్లీలో 118 స్థానాల మ్యాజిక్ మెజారిటీని దాటడానికి విజయ్‌కు ఐదు రోజులు, గవర్నర్‌తో నాలుగు సమావేశాలు, మిత్రపక్షాలతో చర్చలు జరిపారు. 234 స్థానాలకు గాను 108 స్థానాలను గెలుచుకున్న టీవీకే అధినేత విజయ్ శనివారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు.

CM Vijay | 120 మంది మద్దతు

కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, విదుతలై చిరుతైగళ్ కచ్చి (VCK)కి చెందిన ఇద్దరు శాసనసభ్యులు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఐ-ఎం), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)లకు చెందిన ఇద్దరేసి ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి ఎన్నికైనందున, ఆయన ఒక సీటును ఖాళీ చేయాల్సి ఉంటుంది. దీంతో కూటమిలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 120కి చేరింది.

CM Vijay | 60 ఏళ్ల తర్వాత

దాదాపు 60 ఏళ్లలో తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకేయేతర పార్టీ నుంచి విజయ్​ సీఎంగా ప్రమాణం చేశారు. కార్యకర్తల నినాదాల మధ్య విజయ్​ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా స్టేడియంలో సందడి నెలకొంది. చెన్నైనగరంలో ఎల్ ఈడీలతో ప్రమాణ స్వీకారం లైవ్ ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు.

CM Vijay | బిగ్​ డే

విజయ్‌ ప్రమాణస్వీకారానికి నటి త్రిష (Trisha) హాజరు అయ్యారు. ‘‘ఔను ఈరోజు బిగ్‌ డే.. దీని కోసమే ఎదురు చూస్తున్నా” అంటూ ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ సైతం హాజరు అయ్యారు.

ఇది కూడా చదవండి : Gujarat ship attack | హోర్ముజ్ జలసంధిలో రక్తపాతం.. గుజరాత్​ నౌకపై దాడి.. భారతీయ నావికుడి దుర్మరణం

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *