Sindhu Hospital Controversy | సింధు హాస్పిటల్.. మూడు జెండాలు.. ఒకే ఎజెండా.. తెలంగాణ రాజకీయాల్లో ‘అంతుచిక్కని’ బంధం!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sindhu Hospital Controversy | రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయనే దానికి ‘సింధు హాస్పిటల్‘ ఒక సజీవ సాక్ష్యం. ఇక్కడ జెండాలు వేరు, సిద్ధాంతాలు వేరు.. కానీ ‘లాభదారుడు’ మాత్రం ఒక్కరే!.

ఇటీవల హైటెక్ సిటీ సాక్షిగా జరిగిన ఆస్పత్రి ప్రారంభోత్సవం తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక విచిత్రమైన ఘట్టంగా మిగిలిక తప్పదు. సాధారణంగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే పార్టీలు, ఒక వ్యాపార సామ్రాజ్యం విషయంలో ఎలా ‘భాయ్-భాయ్’ అన్నట్లు కలిసిపోయాయో చూస్తుంటే సామాన్య ఓటర్లకు విస్మయం కలిగిస్తోంది.

akshara today .jpg sindhu

Sindhu Hospital Controversy | రూ.500 కోట్ల భూమి.. ‘కారు’ చౌకగా!

2018లో అప్పటి బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) ప్రభుత్వ హయాంలో ఈ కథ మొదలైంది. హేటెరో (Hetero) గ్రూప్ ఛైర్మన్ బండి పార్థసారథి రెడ్డి తన కుమార్తె కృష్ణ సింధూరి జ్ఞాపకార్థం ఒక క్యాన్సర్ ఆస్పత్రి కట్టాలనుకున్నారు. ప్రభుత్వంపై ఆయనకున్న ప్రభావమో..? లేక రాజకీయ అవసరమో.. కానీ, ఖానామెట్‌లో 15 ఎకరాల అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని కేటాయించారు.

ఆ ప్రాంతంలో ఎకరం భూమి విలువ మార్కెట్ ప్రకారం రూ.40 కోట్ల పైమాటే. అంటే 15 ఎకరాల విలువ సుమారు రూ.600 కోట్లు. అంతటి భారీ విలువైన భూమిని కేవలం రూ.1.47 లక్షల వార్షిక అద్దెకు 33 ఏళ్ల పాటు ‘సాయి సింధు ఫౌండేషన్’ (Sai Sindhu Foundation)కు కట్టబెట్టారు.

అంటే నెలకు కేవలం రూ.12,000 అద్దె! హైదరాబాద్‌ నడిబొడ్డున ఒక సామాన్యుడికి డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కూడా ఈ ధరకు దొరకదనడంలో అతిశయోక్తి లేదు. ఈ కేటాయింపు జరిగిన కొన్నాళ్లకే హేటెరో గ్రూప్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి రూ.120 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు అందడం, ఆపై పార్థసారథి రెడ్డికి రాజ్యసభ సీటు దక్కడం.. ఇదంతా ఒక పక్కా స్కెచ్ ప్రకారం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తాయి.

Cm revanth reddy 1

Sindhu Hospital Controversy | రేవంత్ రెడ్డి గర్జన: ‘జైలు’ నుంచి ‘జీవో’ వరకు!

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ భూ కేటాయింపుపై పెద్ద యుద్ధమే ప్రకటించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ‘భూ దోపిడీ’ గురించి ఎండగట్టారు. “ఇది పట్టపగలు జరుగుతున్న భారీ దోపిడీ! కేసీఆర్ (KCR) సర్కార్ సర్కారు భూములను అస్మదీయులకు ధారాదత్తం చేస్తోంది. తాము అధికారంలోకి రాగానే ఈ అక్రమ కేటాయింపులను రద్దు చేస్తాం. భూములను వెనక్కి తీసుకుంటాం. ఈ అక్రమాలకు పాల్పడిన వారందరినీ చట్టం ముందు నిలబెడతాం. కఠిన శిక్షలు అమలు చేయడం ద్వారా జైలుకు పంపిస్తాం” – ఇవి 2023లో రేవంత్ రెడ్డి చేసిన బహిరంగ హెచ్చరిక ఇది.

Sindhu Hospital Controversy | సీన్​ రీవర్స్​

కాలం మారింది.. కుర్చీ కూడా మారింది! 2023 ఏడాది చివరలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. బాధ్యులపై విచారణ జరుగుతుందని అందరూ ఆశించారు. కానీ, సీన్ రివర్స్ అయింది.

2024 మార్చిలో రేవంత్ ప్రభుత్వం అనూహ్యంగా GO 37 జారీ చేసింది. ఎకరాకు అద్దెను రూ.5 లక్షలకు పెంచి (మొత్తం రూ.75 లక్షలు) అదే లీజును ఖరారు చేసింది. నిన్నటి దాకా ‘విలన్’గా కనిపించిన వ్యక్తి, నేడు ప్రభుత్వానికి ‘భాగస్వామి’గా ఎలా మారారు?

కోట్లాది రూపాయల విలువైన భూమిని కాపాడాల్సిన ప్రభుత్వం, కేవలం అద్దె పెంచి చేతులు దులుపుకోవడం వెనుక ఉన్న మర్మం ఏమిటనేది ప్రస్తుతం ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్న.

High Court

Sindhu Hospital Controversy | కోర్టు అక్షింతలు.. సర్కారు మొండితనం!

ఈ భూమి కేటాయింపు చట్టవిరుద్ధమని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అప్పటి సర్కారు జీవోను హైకోర్టు రద్దు చేసింది. దీంతోపాటు నిబంధనల ప్రకారం పునఃసమీక్షించమని ఆదేశించింది. కానీ, ప్రభుత్వాలు మారినా ‘ఫైళ్ల గమ్యం’ మారలేదు. కోర్టు అభ్యంతరాలను కేవలం అద్దె పెంపుతో సరిపెట్టి, ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడంలో పాలకులు చూపిస్తున్న శ్రద్ధ చర్చనీయాంశం.

Sindhu Hospital Controversy | బీజేపీ అవినీతి వ్యతిరేక గళం ఎక్కడ?

ఇక ఈ కథలో మూడో కోణం భాజపా. కేంద్రంలోని బీజేపీ (BJP) సర్కారు అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలని, ఒకరికొకరు తోడు అని విమర్శిస్తుంటుంది. రాష్ట్ర బీజేపీ నేతలు ఈ భూ కేటాయింపుపై గతంలో ఎన్నో నిరసనలు చేపట్టారు.

కానీ, తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) స్వయంగా వచ్చి ఈ హాస్పిటల్‌ను ప్రారంభిస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీని వెనుక ఏవైనా జాతీయ స్థాయి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా? లేక కార్పొరేట్ శక్తుల ఒత్తిడి ఉందా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

akshara today .jpg flags

Sindhu Hospital Controversy | మూడు పార్టీల ‘సమన్వయం’ – సారాంశం

బీఆర్ఎస్ (దాత): ప్రభుత్వ భూమిని కారు చౌకగా ధారాదత్తం చేసి పునాది వేసింది.

కాంగ్రెస్ (రక్షక): అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తామన్న లీజును జీవోల ద్వారా చట్టబద్ధం చేసింది. నిర్మాణాన్ని పూర్తి చేయించింది.

బీజేపీ (కర్త): నరేంద్ర మోదీ ప్రధాని హోదాలో రిబ్బన్ కట్ చేసి ఈ వివాదాస్పద ‘మహా క్రతువు’కు జాతీయ గుర్తింపు తీసుకొస్తున్నారు.

Sindhu Hospital Controversy | ప్రజా హితమా.. రాజకీయ లాభమా?

క్యాన్సర్ ఆస్పత్రి నిర్మించడం, పేదలకు వైద్యం అందడం కచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ, ఆ నెపంతో రూ.వందల కోట్ల ప్రజా ఆస్తిని కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు అప్పగించడం, ఆ ప్రక్రియలో రాజకీయ నేతలు వారి మాటలను వారే మింగేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

“నాయకులు మారుతారు.. జెండాలు కూడా మారుతాయి.. నేతలు ఒకరినొకరు తిట్టుకుంటారు.. కానీ, తెర వెనుక ఉండే పెద్దల ప్రయోజనాలు మాత్రం ఎప్పుడూ భద్రంగానే ఉంటాయి..!” అనడానికి సింధు హాస్పిటల్ ఒక సజీవ ఉదాహరణగా చెబుతున్నారు. తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే.. “రాజకీయాల్లో యుద్ధాలు అంటే కేవలం తమ ముందేనా? లోపల వారంతా ఒకటేనా?”

దీనిని కూడా చదవండి : Modi Hyderabad Visit | హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. చంద్రబాబు, పవన్ నివాసాలకు ప్రత్యేకంగా వెళ్లి భేటీ కానున్నారా..!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *