అక్షరటుడే, వెబ్డెస్క్: Dowry Harassment Cases | సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా, ప్రపంచ స్థాయి కంపెనీలకు నిలయంగా వెలుగొందుతున్న కర్ణాటకలోని బెంగళూరు (Bengaluru).. గృహ హింస, వేధింపుల వంటి వికృత పోకడలతో అభానుపాలవుతోంది.
చదువుకున్న వారు ఎక్కువగా నివసించే ఈ మహానగరంలో అదనపు కట్నం కోసం అత్తవారింటి వేధింపులు ఎక్కువగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన ‘క్రైమ్ ఇన్ ఇండియా 2024’ నివేదిక దీనిని స్పష్టం చేసింది. దేశంలోని మెట్రో నగరాలన్నింటిలో బెంగళూరు అత్యధిక వరకట్న కేసులను నమోదు చేసి ప్రథమ స్థానంలో నిలవడం గమనార్హం.
Dowry Harassment Cases | 87 శాతం కేసులు ఇక్కడే..
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (National Crime Records Bureau) 2023 -24 కు సంబంధించిన నేర గణాంకాల నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలోని 19 మెట్రో నగరాల్లో నమోదైన మొత్తం వరకట్న కేసుల్లో సింహభాగం బెంగళూరులోనే ఉండడం గమనార్హం. దేశంలోని మొత్తం మెట్రో నగరాల్లో 1,008 కేసులు నమోదవగా.. ఇందులో 878 కేసులు బెంగళూరులోనే ఉన్నాయి. అంటే మెట్రో నగరాల్లో నమోదైన మొత్తం వరకట్న నిషేధ చట్టం కేసుల్లో 87 శాతం బెంగళూరులోనే నమోదయ్యాయన్న మాట. ఇది ఆ మహానగరంలోని పరిస్థితిని తెలియజేస్తోంది. 48 కేసులతో లక్నో రెండో స్థానంలో ఉంది.
Dowry Harassment Cases | వరకట్న మరణాల్లో ఢిల్లీ..
వరకట్న మరణాలు ఎక్కువగా ఢిల్లీ (Delhi)లో నమోదవుతున్నాయి. 109 మరణాలతో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. బెంగళూరులో 25, హైదరాబాద్‌లో 14 మరణాలు నమోదయ్యాయి. కాగా దక్షిణ భారత నగరాలైన చెన్నై, కోయంబత్తూరు, కొచ్చి వంటి నగరాల్లో సున్నా కేసులు నమోదవడం గమనార్హం. మహిళలపై అరాచకాలు, నేరాల విషయంలో ఢిల్లీ, ముంబయి, బెంగళూరు టాప్ 3లో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Gold Traders Tension | బంగారం వ్యాపారుల్లో టెన్షన్.. రేపు పీఎంవో అధికారులతో భేటీ!

