అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Petrol Price Hike | పశ్చిమ ఆసియాలో నెలకొన్న జియో పొలిటికల్ టెన్షన్స్‌తో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైంది.
అమెరికాపై ఒత్తిడి తెచ్చేందుకు ఇరాన్ సరుకు రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని మÖసి వేసింది. దీంతో క్రూడ్ ఆయిల్, గ్యాస్ రవాణాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలు రావడంతో చాలా దేశాలు ఇప్పటికే పెట్రోల్ , డీజిల్ ధరలను గణనీయంగా పెంచేశాయి. మనదేశంలో మాత్రం ఆ భారాన్ని ప్రజలపై పడకుండా చూస్తూ వచ్చారు.
Petrol Price Hike | చమురు సంస్థలపై భారం..
క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర దాదాపు రెట్టింపవడంతో చమురు కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. ప్రస్తుతం చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపై నెలకు దాదాపు రూ. 30 వేల కోట్ల మేర నష్టాన్ని భరించాల్సి వస్తోందని కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ఇటీవల పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా సామాన్యుడిపై భారం పడకుండా ఇన్నాళ్లూ కంపెనీలే నష్టాలను భరిస్తూ వచ్చాయి. కానీ అది మోయలేని భారంగా మారడంతో శుక్రవారం ఉదయం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
Petrol Price Hike | ఏ నగరంలో ఎంతంటే..
ఒకే దేశం అయినా పెట్రోల్, డీజిల్ కు సంబంధించి హైదరాబాద్‌లో ఒక రేటు, ఢిల్లీలో మరో రేటు ఇతర నగరాల్లో ఇంకో రేటు ఉంటుంది. దీనికి కారణం రవాణా చార్జీలతోపాటు ఆయా రాష్ట్రాలు విధించే పన్నులు. ప్రస్తుతం దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98 ఉండగా.. చెన్నైలో రూ. 103, బెంగళూరు, ముంబయిలలో రూ. 106, కోల్‌కతాలో రూ. 108 ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రూ. 111 లకు చేరడం గమనార్హం.
Petrol Price Hike | ఇంతటితో ఆగేనా?
క్రూడ్ ఆయిల్ ధర మÖడు నెలల కాలంలో దాదాపు రెట్టింపు అయ్యింది. ఇటీవలి కాలంలో బ్యారెల్ ధర 107 డాలర్లపైనే కొనసాగుతోంది. దీంతో చమురు కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగానే శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ. 3 చొప్పున పెంచారు. అయితే ప్రస్తుతం చమురు కంపెనీలకు ఎదురవుతున్న నష్టాలతో పోల్చితే ఇది చాలా చిన్న మొత్తమే. క్రూడ్ ఆయిల్ ధర దిగిరాకపోతే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను మరింతగా పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
లేకపోతే ఐవోసీఎల్ , బీపీసీఎల్, హెచ్‌పిసీఎల్ వంటి ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల మనుగడ కష్టం అవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ధరల పెంపు ఇంతటితో ఆగకపోవచ్చన్న అభిప్రాయం మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ గ్యాప్ ను పూడ్చాలంటే మరో 30 శాతానికిపైగా ధరలు పెంచాల్సి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇంధనం ధరలను భారీగా పెంచితే దేశంలో అన్నింటిపై ప్రభావం పడి ద్రవ్యోల్బణం పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే దశలవారీగా పెంచే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి..: Fuel Price Hike | ఇంధన ధరల పెంపుపై రాహుల్ గాంధీ విమర్శలు


