అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vijay Fan Donation | ప్రముఖ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) నటించిన ‘తమిళన్’ సినిమా ప్రభావంతో ఓ అభిమాని చేసిన వినూత్న ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నైకి చెందిన అరుణ్ లోకనాథన్ అనే వ్యక్తి రాష్ట్ర అప్పు తీర్చేందుకు తన వంతు సహాయంగా రూ.22,674లను సీఎం సహాయ నిధికి జమ చేశారు.
2002లో విడుదలైన ‘తమిళన్’ చిత్రంలో హీరో విజయ్ దేశ అప్పును తీర్చేందుకు ప్రధానికి రూ.4000ల చెక్కు పంపే సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సన్నివేశం నుంచి ప్రేరణ పొందిన అరుణ్.. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో అదే తరహాలో స్పందించడం విశేషంగా మారింది.
Vijay Fan Donation | గొప్ప ప్రయత్నం..
అరుణ్ లోకనాథన్ (43) వృత్తిరీత్యా మెంటలిస్ట్, హిప్నాటిస్ట్. ఈ ఏడాది తమిళనాడు బడ్జెట్ గణాంకాలను పరిశీలించిన ఆయన.. రాష్ట్ర అప్పు ఒక్కో పౌరుడిపై లక్ష రూపాయలకు పైగా ఉందని లెక్కించారు. ఈ క్రమంలో విజయ్ పుట్టినరోజు జూన్ 22, 1974ను గుర్తు చేస్తూ రూ.22,674లను సీఎం సహాయ నిధికి పంపించారు. విల్లివాక్కం పోస్టాఫీసు ద్వారా ఈ మొత్తాన్ని పంపించిన అరుణ్.. “మనం కోరుకునే మార్పు మన నుంచే ప్రారంభమవ్వాలి” అనే సందేశాన్ని వెల్లడించారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది.
Vijay Fan Donation | ఇదిలా ఉండగా
అంతేకాదు, సీఎం విజయ్‌కు రాసిన లేఖలో అరుణ్ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రస్తావించారు. చిన్నతనంలో పోలియో బారిన పడినట్లు తెలిపిన ఆయన.. వికలాంగులకు ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తాను అందించిన నిధులు రాష్ట్ర అప్పు తీర్చడానికి కాకపోయినా, కనీసం వికలాంగుల సంక్షేమానికి ఉపయోగపడితే తన ప్రయత్నం సార్థకమవుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, అంబేద్కర్ లా కాలేజీలో విద్యార్థిగా ఉన్న రోజులలో ‘తమిళన్’ సినిమా చూసిన అరుణ్.. ఆ చిత్రంలోని సామాజిక సందేశాలకు ప్రభావితమయ్యారని తెలిపారు. సినిమాలో విజయ్ న్యాయవాదిగా నటిస్తూ సామాన్యులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడతారు. వెండితెరపై చూసిన ఆ ఆలోచనలను 25 ఏళ్ల తర్వాత నిజ జీవితంలో ఆచరణలో పెట్టడం ఇప్పుడు అందరి ప్రశంసలను అందుకుంటోంది.
ఇది కూడా చదవండి..: Petrol Price Hike | నాలుగేళ్ల తర్వాత పెట్రోల్ ధరల పెంపు.. మరో 30 శాతం వడ్డన తప్పదా?


