అక్షరటుడే వెబ్‌డెస్క్:RTC Merger Talks|తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ మినిస్టర్ క్వార్టర్స్‌లో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, యూనియన్ ఎన్నికలు , కార్మికుల ఇతర సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
RTC Merger Talks|నేపథ్యం..
గత నెలలో తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ (JAC) బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మే 1వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో యూనియన్ నేతలు సమావేశమయ్యారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి ఒక కీలక ప్రతిపాదనను నేతల ముందుంచారు. “మీకు కార్మిక సంఘాల ఎన్నికలు కావాలా? లేక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలా?” అని ఆప్షన్ ఇచ్చారు.
RTC Merger Talks|విలీనానికే మొగ్గు చూపిన నేతలు..
ముఖ్యమంత్రి ఇచ్చిన ఆఫర్‌పై యూనియన్ నాయకులు ఏకగ్రీవంగా స్పందించారు. కార్మిక సంఘాల ఎన్నికల కంటే ప్రభుత్వంలో విలీనం కావడమే తమకు ప్రాధాన్యమని, ఆ డిమాండ్‌కే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. విలీనం జరిగితే తమ ఉద్యోగ భద్రతతో పాటు ఇతర సమస్యలు కూడా పరిష్కారమవుతాయని వారు భావిస్తున్నారు.
నేతల అంగీకారం తర్వాత, ఈ అంశాన్ని రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తే ప్రక్రియ ప్రారంభమవుతుందని అప్పట్లో సీఎం హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో త్వరలోనే ఆర్టీసీ కార్మికుల విలీన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Sanathnagar TIMS | అంతర్జాతీయ ప్రమాణాలతో టిమ్స్ ఏర్పాటు చేశాం : కేటీఆర్


