అక్షరటుడే, వెబ్డెస్క్ : US Iran Nuclear Talks | అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న అణు చర్చలు మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్ అణు కార్యక్రమాలపై నియంత్రణ తీసుకురావాలనే లక్ష్యంతో జరిగిన తాజా చర్చల సందర్భంగా అమెరికా పలు కీలక షరతులను ప్రతిపాదించినట్లు సమాచారం.
అయితే ఈ ప్రతిపాదనలను ఇరాన్ తీవ్రంగా ఖండించడంతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. సమాచారం ప్రకారం అమెరికా (America) ప్రతిపాదించిన షరతుల్లో ఇరాన్ వద్ద ఉన్న దాదాపు 400 కిలోల యురేనియాన్ని అమెరికాకు అప్పగించాలనే అంశం ప్రధానంగా ఉంది. అలాగే దేశంలో ఒకే ఒక్క అణు కేంద్రాన్ని మాత్రమే కొనసాగించాలని సూచించినట్లు తెలుస్తోంది. గతంలో విధించిన ఆర్థిక ఆంక్షల కారణంగా ఇరాన్ ఎదుర్కొన్న నష్టాలకు అమెరికా ఎలాంటి పరిహారం ఇవ్వబోదని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం.
US Iran Nuclear Talks | ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్..
అంతేకాకుండా విదేశాల్లో నిలిచిపోయిన ఇరాన్ ప్రభుత్వ (Iranian government) నిధుల్లో 25 శాతం మొత్తాన్ని విడుదల చేయడం కూడా సాధ్యం కాదని అమెరికా వైఖరి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే వివిధ యుద్ధ ప్రాంతాల్లో శాంతి, భద్రత అంశాలపైనే చర్చలు జరగాలని కూడా అమెరికా షరతుల్లో పేర్కొన్నట్లు సమాచారం. అమెరికా ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించిన ఇరాన్ తనవైపు నుంచి కూడా పలు డిమాండ్లను ముందుకు తెచ్చింది. గల్ఫ్ ప్రాంతంతో పాటు లెబనాన్ (Lebanan) సహా వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణలను తక్షణమే నిలిపివేయాలని ఇరాన్ కోరింది. తమపై ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని అంతర్జాతీయ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేసింది.
US Iran Nuclear Talks | ప్రపంచ ఇంధన రవాణాలో..
అలాగే విదేశాల్లో నిలిచిపోయిన తమ ఆర్థిక నిధులను వెంటనే విడుదల చేయాలని, గత ఆంక్షల వల్ల దేశానికి కలిగిన ఆర్థిక నష్టాలకు పరిహారం చెల్లించాలని కూడా ఇరాన్ పేర్కొంది. ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలని కూడా ఇరాన్ షరతు పెట్టింది. ఈ అంశంపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తీవ్ర స్థాయిలో స్పందించారు. అమెరికా, ఇజ్రాయెల్ (Israel) శాంతి చర్చల పేరుతో ప్రాంతీయ ఉద్రిక్తతలను కొనసాగిస్తున్నాయని ఆరోపించారు.
ముందుగా సంక్షోభాలను సృష్టించి, తరువాత శాంతి పేరుతో చర్చలు జరపడం పాత వ్యూహమని విమర్శించారు. ఇదే సమయంలో ఇరాన్ పార్లమెంట్ నాయకత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. తమ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోకపోతే భవిష్యత్తులో దాని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని పేర్కొంది.అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఈ విభేదాలు ప్రపంచ రాజకీయాలు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు, భద్రతా పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇరువైపుల చర్చలు ఏ దిశగా సాగుతాయన్నది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి..: Mexico shooting incident | మెక్సికోలో దుండగుడి కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది దుర్మరణం


