అక్షరటుడే వెబ్‌డెస్క్: Bandi Bhagirath Case | తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న బండి భగీరథ్ కేసు విషయమై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఆయన కుమారుడు భగీరథ్‌ను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Bandi Bhagirath Case | తప్పు చేయనప్పుడు రాజీనామా ఎందుకు?
బండి సంజయ్ ఎలాంటి తప్పు చేయలేదని, ఒకవేళ ఆయన తప్పు చేసి ఉంటే పార్టీ ఖచ్చితంగా చర్యలు తీసుకునేదని రామచందర్ రావు స్పష్టం చేశారు. ఆ కుటుంబంలో కేంద్ర మంత్రి ఉన్నారనే ఒకే ఒక్క కారణంతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లినప్పుడు కేసీఆర్, కేటీఆర్ తమ పదవులకు రాజీనామా చేశారా?” అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. చట్టప్రకారం ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవడం ప్రతి పౌరుడి హక్కు అని, భగీరథ్ ఎక్కడికీ పారిపోలేదని, చట్టాన్ని గౌరవించి ఇప్పటికే సరెండర్ అయ్యాడని ఆయన గుర్తుచేశారు.
Bandi Bhagirath Case|గత ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీత..
బీఆర్ఎస్ హయాంలో జరిగిన పలు వివాదాస్పద ఘటనలను ప్రస్తావిస్తూ రామచందర్ రావు ఘాటు విమర్శలు చేశారు. గత పాలనలో పబ్‌లో జరిగిన అత్యాచార ఘటనలో ఒక ఎంఐఎం నేత కొడుకు ప్రమేయం ఉన్నా ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. కొమురం భీం జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచారం, లంబాడా యువతి కస్టోడియల్ డెత్ వంటి సంఘటనలు జరిగినప్పుడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు, కారు రేసింగ్ కేసుల్లో బీఆర్ఎస్ నేతలు ముందుగానే కోర్టులను ఎందుకు ఆశ్రయించారో సమాధానం చెప్పాలన్నారు.
Bandi Bhagirath Case|కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి.. బీజేపీ వైపు ప్రజలు..
కాళేశ్వరం అవినీతి, కారు రేసింగ్ కేసులపై విచారణ వేగంగా జరిగేలా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ప్రధాని మోదీ సభలు అఖండ విజయం సాధించాయని, తెలంగాణ ప్రజలంతా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతల ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ద్వారా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలెవరూ నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు.
లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్తే కేసీఆర్ , కేటీఆర్ రాజీనామా చేశారా?
– తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు pic.twitter.com/Bhi7uFyc6p
— Telugu360 (@Telugu360) May 18, 2026
ఇది కూడా చదవండి:Modi Norway Visit | నార్వేలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం


